Share News

కోళ్లు...కాళ్లు దువ్వేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:46 AM

సంక్రాంతి పండుగ సమీపించడంతో కోడిపందాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఐదేళ్లుగా పందాలకు దూరంగా ఉన్న టీడీపీ నాయకులు కోడిపందాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటికి ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

కోళ్లు...కాళ్లు దువ్వేస్తున్నాయ్‌!

కోళ్లు...కాళ్లు దువ్వేస్తున్నాయ్‌!

ముమ్మిడివరం, జనవరి10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమీపించడంతో కోడిపందాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ఐదేళ్లుగా పందాలకు దూరంగా ఉన్న టీడీపీ నాయకులు కోడిపందాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటికి ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. సంక్రాంతి పండుగ సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌లు పదేపదే సూచిస్తున్నా నిర్వాహకులు మాత్రం ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా పందాల నిర్వహణకు సంసిద్ధమవుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమళ్లలో భారీఎత్తున కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పందెంరాయుళ్లు, పందాలు వీక్షించేందుకు వచ్చేవారు ఇప్పటికే పలు ప్రైవేటు కాటేజీలను బుక్‌ చేసుకున్నారు. పండుగ మూడు రోజులు బస చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మురమళ్లలోను, ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఉన్న ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. కాట్రేనికోన మండలం చెయ్యేరు, గెద్దనాపల్లిలోని, ముమ్మిడివరం మండలంలోని రాజుపాలెం, కొత్తలంక, అన్నంపల్లి, గేదెల్లంక, అయినాపురం తదితర గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. రాజుపాలెంలో కోడిపందాల నిర్వహణకు సంబంధించి బరి నిర్వాహకుడు బీజేపీ మండలస్థాయి నాయకుడు. రూ.9.50 లక్షలకు నిర్వాహకుల వద్ద పాడుకున్నట్టు సమాచారం. ఈ రూ.9.50 లక్షల్లో కొంత గ్రామంలోని దేవాలయాలకు, పోలీసు, రెవెన్యూ, మీడియాకు ఇంతని కేటాయించినట్టు సమాచారం. మూడు రోజులపాటు కోడిపందాలు, పేకాట, మద్యం, బిర్యానీ, పకోడీ స్టాల్స్‌ వంటివి ఏర్పాటుచేసేందుకు బరుల వద్ద ఒక్కొక్క దానికి ఒక్కో రేటు నిర్ణయించి వారికి కేటాయిస్తున్నారు. ఈ ఏడాది పండుగ మూడు రోజులు కోడిపందాలు, గుండాట, పేకాట వంటికి జోరుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. పందాల నిర్వహదారుల నుంచి బరుల నిర్వాహకులు కోడిపందాలు, పేకాట, బిర్యానీ, మాం సం పకోడి వంటి స్టాల్స్‌ ఏర్పాటుకు పాట పాడుకుని వాటిని ఏర్పాటుచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు కోడిపందాలు, జూదాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినా నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా తమ ఏర్పాట్లలో మునిగారు.

Updated Date - Jan 11 , 2025 | 01:47 AM