Share News

సిద్ధమవుతున్న పందాలబరులు

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:13 AM

సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగిపోతున్నాయి.

సిద్ధమవుతున్న పందాలబరులు

రావులపాలెం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగిపోతున్నాయి. మండలంలోని రావులపాలెం, రావులపాడు, ఈతకోట, దేవరపల్లి, పొడగట్లపల్లితోపాటు పలు ప్రాంతాల్లో పందెం బరులను ఏర్పాటు చేసే పనిలో నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. ఇం దులో భాగంగా స్థలాలను చదును చేస్తున్నారు. అక్కడే గుండాట, పేకాటలను నిర్వహించేందుకు క్యాబిన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు తిరిగే ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నా, వాటిని అడ్డుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

మండపేట: సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందాలు, గుండాట నిర్వహణకు పందెపు రాయుళ్లు శనివారం వాటి ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. నియోజకవర్గంలో 12 చోట్ల పందెం బరులు సిద్ధం అవుతున్నాయి. మండపేటలో 3, రూరల్‌లో 3, రాయవరంలో 3, కపిలేశ్వరపురం మండలంలో 3 చోట్ల పందేలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో పందేలు, గుండాట నిర్వహణతోపాటు మద్యం విక్రయాలు, బిర్యానీ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు సంబంధించి నిర్వాహకులు వేలం నిర్వహించారని తెలిసింది. మూడు రోజులపాటు జరిగే ఈ పందేల వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు 12 బరులు వున్నప్పటికి పండుగ నాటికి మరిన్ని పెరిగే అవకాశం లేకపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:13 AM