కో..ఢీ..
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:19 AM
బరితెగించారు.. క్రికెట్ స్టేడియాలను తలపించేలా బరులు వెలిశాయి.. పోలీసులు కాదన్నా.. హైకోర్టు వద్దన్నా బరులు వేశారు.. కోళ్లకు కత్తులు కట్టారు.. పందెంరాయుళ్ల పంతాలతో పోటీలు పోటెత్తాయి. ఎక్కడికక్కడ బరుల్లో పుంజులు హోరాహోరీగా పోరాడాయి.. అటు పందాల పక్కనే గుండాటలు జోరందు కున్నాయి. లక్షలకు లక్షల పందాలతో హోరాహోరీగా సాగాయి..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కత్తులు దూసిన కోళ్లు
1140 బరులుపైనే.. రూ.175 కోట్ల లావాదేవీలు
గుండాట జోరు - రాజానగరంలో బాల్ ఆట
చాలా ప్రాంతాల్లో బహుమతులుగా బుల్లెట్లు
కరపలో మూడు రోజుల విజేతకు థార్ జీప్
హైకోర్టు కాదన్నా..పోలీసులు వద్దన్నా ఆగలేదు..
బరితెగించారు.. క్రికెట్ స్టేడియాలను తలపించేలా బరులు వెలిశాయి.. పోలీసులు కాదన్నా.. హైకోర్టు వద్దన్నా బరులు వేశారు.. కోళ్లకు కత్తులు కట్టారు.. పందెంరాయుళ్ల పంతాలతో పోటీలు పోటెత్తాయి. ఎక్కడికక్కడ బరుల్లో పుంజులు హోరాహోరీగా పోరాడాయి.. అటు పందాల పక్కనే గుండాటలు జోరందు కున్నాయి. లక్షలకు లక్షల పందాలతో హోరాహోరీగా సాగాయి.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాలో తొలిరోజు 1140 బరులుపైనే వెలిశాయి. మొత్తం రూ.175 కోట్ల లావాదేవీలు జరిగాయి. కోడి పందాలకు హైకోర్టు అనుమతి నిరాకరించినా బరితెగించి ఆడేశారు. అయినా ఏ ఒక్కరూ అటువైపే కన్నెత్తి చూడలేదు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కోళ్లు కోట్లాట ఆడుకున్నాయి.. నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి.. ఎక్కడా వెనక్కు తగ్గలేదు.. చివరి శ్వాస వరకూ పోరాడాయి. వేలాది పుంజులు బరిలోనే ప్రాణాలు విడిచా యి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాలో తొలిరోజు కోడి పందాలు, గుండాటలు హోరెత్తాయి. కాకినాడ జిల్లావ్యాప్తంగా సోమవారం దాదాపు 410 చోట్లకు పైగా బరులు వెలిశాయి. ఒక్కో బరిలో రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లావాదేవీలు జరిగాయి. తొలి రోజు రూ.65 కోట్లకుపైగా పందాలు, ఇతర బెట్టింగ్‌లు జరిగాయి. ఒక్కో బరి వద్ద మూడు నుంచి నాలుగు వరకు గుండాట బోర్డులతో వ్యాపారం జరిపారు. ప్రధానంగా కాకినాడ రూరల్, కరప మండలాల్లో రూ.25 కోట్ల వరకు కోడిపందాలు, గుండా ట వ్యాపారం జరిగింది. బరుల్లో భారీ షామియానాలు, మైక్ సెట్‌లు, పెన్సింగ్ ఏర్పాటుచేసి మరీ పందాలు నిర్వహించా రు. జిల్లాలో ఆ చివర తుని నుంచి ఈ చివర తాళ్లరేవు వర కు భారీగా పందేలు జరిగాయి. టీడీపీ, జనసేన నేతలు ఎవ రికి వారు పోటాపోటీగా బరులు నిర్వహించి పందాలు ఆడిం చారు. పిఠాపురంలో ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వేర్వేరు ప్రాంతాల్లో కోడిపందాలు ప్రారం భిం చి తిలకించారు. కరప మండలంలో రూ.36 లక్షలకు వేలంలో బరి దక్కించుకున్న నిర్వాహుకులు తొలిరోజు రూ.10 కోట్లకు పైగా పందాలు నిర్వహించారు. పండగకు ముందురోజు బరు లు ధ్వంసం చేసిన పోలీసులు సోమవారం కన్నెత్తిచూడలేదు.
కోనసీమలో రూ.60 కోట్లు ఆడేశారు..
అమలాపురం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ముసుగులో కోడిపందాలు, గుండాటలు, పేకాట సోమవారం జోరుగా ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులే దగ్గరుండి పందెం బరులను ప్రారంభించడంతోపాటు పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. టీడీపీ, జనసేన కూటమి నేతలకు పందెం బరులు ఉపాధి మార్గాలుగా మారాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులతో పార్టీ నేతలే కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని బరులు నిర్వహించడానికి అనుమతులు తీసుకుని వాటిని వేరే వ్యక్తులకు విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు లాభాలుగా ఆర్జించిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు యంత్రాంగం మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడలేదు. కోనసీమ జిల్లా మురమళ్లలో వీఐపీ బరిని ఏర్పాటుచేశారు. ఇక్కడ రూ. 5 లక్షలు, రూ.10 లక్షల పందాలు జరుగుతుండగా, వాటిపై బయటి పందాలు కోట్ల రూపాయల్లో వేస్తున్నారు. ఇక్కడ విజేతలైన వారికి మెమెంటోతోపాటు చిరు కానుకలు సైతం అందించి సత్కరిస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానందలతో పాటు అనేకమంది ముఖ్య నేతలు ఈ బరిలో జరిగే కోడి పందాలను వీక్షించారు. చెయ్యేరు, గెద్దనపల్లిలో కూడా భారీగా కోడిపందాలు, గుండాటలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట ఎస్.యానాంలో జరుగుతున్న ఉత్సవాల్లో సైతం కోడి పందాలు, గుండాటలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సుమారు రూ.65 కోట్ల మేర పందాలు, గుండాటలు జరిగినట్టు తెలిసింది. అమలాపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు, వెంకటేశ్వరస్వామి గుడి వద్ద గుండాటలు వేశారు. కొంకాపల్లి సత్తెమ్మ చెట్టు వద్ద ప్రైవేటు సెక్యూరిటీ మధ్య పేకాట పోటీలు నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలో జోడు పందాలు గెలుచుకునే విజేతకు బుల్లెట్లు బహుమతులుగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. కామనగరువులో కూడా ఓ బుల్లెట్ సిద్ధంచేశారు. చాలా బరుల వద్ద నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని పందాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అల్లవరం, ఉప్పలగు ప్తం మండలంలోని కొన్ని ప్రాంతాల్లో బరులు వెలవెలబోయాయి. సాకుర్రు గున్నేపల్లి బరి వద్ద ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడిపోయి ఉండడం అక్కడ కలకలం రేపింది. రామచంద్రపురం, మండపేట పట్టణ పరిసరాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పందాలు, గుండాటలు యథేచ్ఛగా జరిగాయి. రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, గూడపల్లి లలో రికార్డింగు డ్యాన్సులు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పోలీసులు జోక్యం చేసుకుని నిలిపివేశారని సమాచారం.
తూర్పున రూ.50 కోట్లు ఆడేశారు..
రాజమమహేంద్రవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లాలోనూ కోడి పందాలు హోరాహోరీగా సాగా యి. రాజకీయ జోక్యంతో రాజకీయ పందాలుగా కనిపించా యి. ఈసారి పందాలతోపాటు జూదం కూడా బాగా పెరిగిం ది. జిల్లావ్యాప్తంగా సుమారు 100పైగా గ్రామాల్లో కోడిపం దాలు, గుండాట, కోతాట జరిగాయి. రంగుబాల్స్ జూదం ప్రవేశించింది. రాజానగరం మండలం దివాన్‌చెరువు శివారు రూపానగర్‌లోని వేపలదిబ్బలో కోడిపందాలతోపాటు గుండా టలు, రంగుబాల్స్ జూదం ఆడారు. జిల్లా అంతటా సుమారు 300 బరులుపైనే ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో బరిలో సగటున 15 లక్షల జరిగినా జిల్లాలో సుమారు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ పందాలు, జూదం జరిగి నట్టు అంచనా. బరుల చుట్టూ వందలాది కోడి పుంజులు పెట్టారు. బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. చాలాచోట్ల వీఐపీ పాసులు.. సాధారణ పాసులు ఇచ్చారు. ఒక్కో బరిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ 30 నుంచి 40 పం దాలు వరకూ జరిగాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ కూటమి నేతల నీడలోనే పందాలు జరిగాయి. బరుల వద్ద స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ముఖ్యనేతల ఫొటోలతో ఉన్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉండడం గమనార్హం.
ఇదండీ సంగతి..
కరపలో నిర్వహించే కోడిపందాల్లో ప్రతిరోజు విజేతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బహుమతిగా ఇస్తామని ప్రక టించారు. రోజు మొత్తం జరిగే పందాల్లో ఎక్కువ పందాలు గెలిస్తే బుల్లెట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇదే బరిలో మూడు రోజులపాటు జరిగే పందాల్లో ఎక్కువ పందాలు గెలిచిన విజేతకు థార్ జీపు ఇస్తామని బరి వద్దే ఉంచి ప్రదర్శించారు. దీంతో తెగ పోటీపడ్డారు. అమలా పురం మండలం కామగరువు, కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో కూడా ఎక్కువ పందాలు గెలిచిన వారికి బుల్లెట్లు ఇస్తామని బరి వద్ద ప్రదర్శించారు.
కోడిపందాల్లో సాధారణంగా ఓమోస్తరు బరిలో ఒక్కో పందెం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వెళ్లింది. అం టే రూ.50 వేల పందెంలో రెండు పుంజుల యజమానులు చెరో రూ.50 వేలు కట్టాలి. కత్తులు కట్టినందుకు, బరి నిర్వ హణకు మొత్తంలో 10 శాతం ఇవ్వాలి. రూ.లక్ష పందెం జరిగితే రూ.10 వేలు నిర్వాహకులకు ఇవ్వవలసిందే. గుం డాటలు, కలర్‌బాల్స్ జూదం వంటి వాటి నిర్వహణకు ప్రాంతాన్ని బట్టి రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ నిర్వాహకులకు చెల్లించాలి.
కోడిపందాల బరులు, గుండాట వద్ద ఫైనాన్స్ వ్యాపారులు డైలీ ఫైనాన్స్ కింద పందెం రాయుళ్లకు అప్పులిచ్చారు. బం గారం ఉంచుకుని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా జగ్గం పేట, కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో అప్పులిచ్చారు.
నిర్వాహకులతో ఒప్పందం మేరకు పోలీసులు కొందరు ఆధార్ కార్డులు తీసుకుని దగ్గర పెట్టుకున్నట్టు తెలిసింది. మూడురోజుల తర్వాత వారిపై కేసులు నమోదు చేస్తారు.