Share News

త్వరలో జన్మభూమి పునఃప్రారంభం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:41 AM

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈలోపుగానే రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులను రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 త్వరలో జన్మభూమి పునఃప్రారంభం

అమలాపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈలోపుగానే రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులను రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రీ హోల్డ్‌ భూముల డేటా ఎంట్రీ, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, రీ సర్వే అంశాలను రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులపై గ్రామాల వారీగా నివేదికలు రూపొందించారన్నారు. భూ వివాదాలకు చెక్‌ పెట్టే దిశగా రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 రెవెన్యూ అంశాలకు సంబంధించి 4212 అర్జీలు అందాయన్నారు. అసైన్డ్‌ ప్రీహోల్డ్‌ భూములు, అన్‌రిజిస్టర్డ్‌ ప్రీ హోల్డ్‌ భూములు, రిజిస్టర్డ్‌ ప్రీహోల్డ్‌ భూములు, ఈనాం, చుక్కల, పట్టా భూములు డేటా ఎంట్రీ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కార సరళిపై అర్జీదారులు నూరుశాతం సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ రెవెన్యూ అంశం ఆన్‌లైన్‌లో ప్రతిబింబించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్‌, భూపరిపాలన డిప్యూటీ తహశీల్దార్‌ చినబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉపకేంద్రం టవర్ల ఏర్పాటుకు సమావేశం..

జిల్లాలో విద్యుత్‌ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యను అధిగమించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. అయినవిల్లి విద్యుత్‌ ఉపకేంద్రం వరకు 64 టవర్లు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు ఆయా భూముల యజమానులతో బుధవారం కలెక్టర్‌ సమావేశం నిర్వహించి భూముల విలువలపై సమీక్షించారు. అయినవిల్లి గ్రామంలో నిర్మిస్తున్న 400 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నిర్వహణకు గాను విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు 64 విద్యుత్‌ టవర్లు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామన్నారు. టవర్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమిని సేకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూ యజమానులకు పరిహారం చెల్లిస్తామన్నారు. భూ విలువలు పెంచి సెంటు భూమికి గరిష్ఠంగా రూ.55 వేలు చొప్పున చెల్లించనున్నట్లు చెప్పారు. ఒక్కో టవర్‌ ఏర్పాటుకు సుమారు రూ.2లక్షలు చొప్పున ఖర్చు అవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూ యజమానులు, రైతులు పూర్తిగా సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జేసీ నిషాంతి, ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శివరామకృష్ణ, డీఈ పుల్లయ్య, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్‌ మల్లికార్జునరావు, సహ ఇంజనీర్లు అనిల్‌, రవికుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:41 AM