జనరిక్ మెడికల్ షాపునకు తాళం
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:42 AM
రాజమహేంద్రవరం జీటీజీహెచ్ (ప్రభుత్వ బోధనా సర్వజన ఆసుపత్రి)లోని ప్రభుత్వ జనరిక్ మందుల షాపు వివాదం ముదురుతుండడంతో రాజమహేంద్రవరం అర్బన్ తహశీల్దార్ పాపారావు మంగళవారం సాయంత్రం తాళం వేయించారు.
కలెక్టర్ ఆదేశాలతో తాళం
జీజీటీహెచ్ వద్ద ఇరుగ్రూపులు
రణరంగంగా మారిన ఆసుపత్రి
పోలీసుల రంగప్రవేశం
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం జీటీజీహెచ్ (ప్రభుత్వ బోధనా సర్వజన ఆసుపత్రి)లోని ప్రభుత్వ జనరిక్ మందుల షాపు వివాదం ముదురుతుండడంతో రాజమహేంద్రవరం అర్బన్ తహశీల్దార్ పాపారావు మంగళవారం సాయంత్రం తాళం వేయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మందుల షాపునకు తాళం వేయిస్తున్నామని పేర్కొన్నారు. వివాదం తేలే వరకూ రెండు గ్రూపుల వారు ఇక్కడకు రావొద్దని సూచించారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. జనరిక్ మందుల షాపు వివాదం మంగళవారం మరింత తారస్థాయికి చేరింది. రెండు మహిళా గ్రూపులకు చెందిన నాయకులు, మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా గందరగోళంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు చెందిన వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు గ్రూపుల నుంచి లీగల్ నాలెడ్జి, రూల్ పొజిషన్ తెలిసిన ప్రతినిధులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ తగ్గలేదు. రెండు మహిళా గ్రూపులు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారులే కావడంతో పాటు పార్టీ నాయకులు సిటీ, రూరల్‌గా విడిపోయారు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పోలీసులకు కూడా ఈ సమస్య సున్నితంగా మారడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయం వరకూ వివాదం నడిచినా ఆ తర్వాత సద్దుమణిగింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం పొద్దునే రెండు గ్రూపుల నాయకులు, మద్దతుదారులు ఆసుపత్రికి చేరుకోవడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ పాపారావు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని షాపునకు తాళం వేయించారు. షాపులో విలువైన మందులు ఉన్నాయని, నష్టపోతామని మహిళా సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో వారితోనే షాపునకు తాళం వేయించి వారికే అప్పగించారు.