ఇక ‘పాడా’ పరుగులు
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:17 AM
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పాడా ఏర్పాటులో మరో ముందడుగు పడింది. పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(పాడా) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా, నవంబరు 22న సాధారణ పరిపాలన శాఖ విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది.
19 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఒకే
పీడీగా యువ ఐఏఎస్ అధికారి
30 శాఖలు పాడా పరిధిలోనే
పిఠాపురం సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అమలు బాధ్యత
తొలి దశలో రూ.50 కోట్లు కేటాయించాలని కలెక్టర్ నివేదిక
(ఆంధ్రజ్యోతి- పిఠాపురం)
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పాడా ఏర్పాటులో మరో ముందడుగు పడింది. పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(పాడా) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా, నవంబరు 22న సాధారణ పరిపాలన శాఖ విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. తాజాగా పాడాలో పీడీతో సహా 19 పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజవకర్గం కుప్పం తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నియోజకవర్గం పరిధిగా పాడా త్వరలోనే ఏర్పాటు కానున్నది. దీనికి పాడా ప్రాజె క్టు డైరెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ టైమ్‌స్కేల్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి లేదా ఆర్డీవోగా పనిచేసిన సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌లను పీడీగా నియమించాలని జీవోలో నిర్దేశించారు. ఐఏఎస్ అధికారి అయితేనే పాడా పరిధిలోకి తీసుకువచ్చిన సుమారు 30 శాఖలు, ప్రభుత్వ విభాగాలను పర్యవేక్షించడంతోపాటు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, పేదరిక నిర్మూలనకు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం వీలవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పాడా పరిధిలోకి ప్లానింగ్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, జలవనరులు(ఇరిగేషన్), గ్రామీణాభివృద్ది (డీఆర్డీఏ, డ్వామా), అటవీశాఖ, ప్రాథమిక, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్, పశుసంవర్థకశాఖ, అన్ని సంక్షేమశాఖలు, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమశాఖ, పౌరసరఫరాలు, హౌసింగ్ తదితర శాఖలను తీసుకువచ్చారు. పాడా పరిధిలో వచ్చే అన్ని ప్రభుత్వశాఖల అధికారులపై ప్రాజెక్టు డైరెక్టర్‌కు పర్యవేక్షణ, సెలవులు మంజూరు, టీఏ, ఇతర బిల్లుల మంజూరు, వార్షిక రహస్య నివేదికలను ఎస్‌ఆర్‌లో నమోదు చేయడం, క్రమశిక్షణా చర్యలు, విచారణ తదితర అధికారాలను కట్టబెట్టారు. అదేవిధంగా పాడా పరిధిలో ఏ అధికారిని లేదా సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఆ స్థానంలో మరొకరిని నియమించిన తర్వాతే రిలీవ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ చైర్మన్ ఉన్న పాడాకు యువ ఐఏఎస్‌ను నియమిస్తే అనుకున్న లక్ష్యాల సాధన సులువవుతుందని భావిస్తున్నారు. ఇక పాడా పరిధిలోకి పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపా టు పిఠాపురం మండలంలోని 24 గ్రామాలు, గొ ల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని 18 గ్రామాలు వెరసి 52 గ్రామాలు వస్తాయి. వీటిపై పూర్తి నియంత్రణ పాడాకే ఉం టుంది. పాడా కార్యరూపం దాల్చేందుకు ముం దుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుం ది. పిఠాపురం కేంద్రంగా పాడా ఏర్పాటు చేస్తున్న ట్టు జీవోలో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఇం దుకు అవసరమైన భవనం కోసం వెదుకులాట ప్రారంభమైంది. పాడా ప్రాజెక్టు డైరెక్టర్, చైర్మన్ చాంబర్‌లు, సమావేశాల నిర్వహణకు హాలు, పాడాకు వివిధ శాఖల నుంచి నియమితులయ్యే 19మంది అధికారులు, సిబ్బంది కూర్చొనే ఏర్పాటు ఉండాలి. పిఠాపురం మండల పరిషత్ కార్యాల యం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో కొంతభాగాన్ని తీసుకుని పాడా కార్యాల యం ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు సాగుతోంది. మరోవైపు కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పన, పాడా పరిధిలోకి వచ్చే ప్రాంతా ల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు రూ.50 కోట్లను తొలి విడతగా కేటాయించాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రస్థాయిలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నోడ ల్ ఏజన్సీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిధు లు ఆ శాఖ నుంచి మంజూరు కావాల్సి ఉంటుం ది. నిధులు విడుదల కాగానే తొలుత తాత్కాలిక పాడా కార్యాలయం మొదలవుతుంది.