పవన్ పర్యటనకు రెడీ!
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:05 AM
పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుక్రవారం జరిపే పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు కార్యక్రమాలకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టారు.
పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు, బహిరంగసభ
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ, ఎంపీ సమీక్ష
పిఠాపురం, జనవరి9(ఆంధ్రజ్యోతి) : పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుక్రవారం జరిపే పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు కార్యక్రమాలకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకుని బహిరంగసభలో పాల్గొనేందుకు శుక్రవా రం పవన్‌కల్యాణ్ తన నియోజకవర్గమయిన పిఠాపురం రానున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం మండలం కుమారపురం చేరుకుని అక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన యాతం నాగేశ్వరరావుకు చెందిన మినీ గోకులాన్ని ప్రా రంభిస్తారు. అనంతరం అక్కడ రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ నుంచి పిఠాపురం పట్టణంలోని పాతబస్టాండు మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల వద్దకు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ పరిశీలిస్తారు. బహిరంగసభా వేదికపై నుంచే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ విధానంలో ప్రారంభించడంతోపాటు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,500 మినీ గోకులాలను ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు. పవన్ పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను కలెక్టర్ సగిలి షాన్‌మోహన్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పరిశీలించారు. వారి వెంట జేసీ రాహుల్‌మీనా, ట్రైనీ కలెక్టర్ భావన, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఉన్నారు.
పర్యటన సాగేది ఇలా..
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శుక్రవారం ఉదయం 7.45కు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా 11.45గంటలకు పిఠాపురం మండలం కుమారపురం చేరుకుంటారు. ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిఽదులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 12.15గంటలకు బయలుదేరి 12.25 గంటలకు పిఠాపురం పట్టణంలోని పాతబస్టాం డు మునిసిపల్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2గంటల వరకూ అక్క డ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఇక్కడ నుంచే పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసానికి 2.30గంటలకు చేరుకుంటారు. విరామం అనంతరం మధ్యా హ్నం 3.30కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి మంగళగిరి ప్రత్యేక విమానంలో వెళతారు.