ఘనంగా గ్రామ దేవతల ఉత్సవాలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:41 AM
సం క్రాంతిని పురస్కరించుకుని ఏడిద రోడ్డులో ఉన్న పేరంటాళ్లమ్మ అమ్మవారి ఉత్సవాన్ని మంగళవారం జరిపారు.
మండపేట, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సం క్రాంతిని పురస్కరించుకుని ఏడిద రోడ్డులో ఉన్న పేరంటాళ్లమ్మ అమ్మవారి ఉత్సవాన్ని మంగళవారం జరిపారు. అమ్మవారికి పలువురు ప్రజా ప్రతినిధులు, భక్తులు దర్శించుకున్నారు. ఏడిదలో వున్న చింతాలమ్మ అమ్మవారి ఉత్స వాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాల వద్ద విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
జొన్నాడలో ఆకట్టుకున్న సారెకావిళ్లు
ఆలమూరు: ఆలమూరు మండలం జొన్నాడ లో పేరంటాలమ్మ జాతర మంగళవారం ఘనం గా జరిగింది. అమ్మవారికి కావిళ్లతో సారె తీసుకెళ్లడం ఆకట్టుకుంది. గ్రామస్తులంతా ఒకేసారి ఊరేగింపుగా కావిళ్లతో అమ్మవారికి పానకం, పిండి వంటకాలు, వస్త్రాలు తీసుకెళ్లి అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. జొన్నాడ గ్రామస్తులతోపాటు మూలస్థానం గ్రామస్తులు సారె సమర్పించి మొక్కు చెల్లించారు.
పసలపూడిలో వెంపర్తమ్మ జాతర
రాయవరం: మండలంలోని పసలపూడి గ్రామస్తుల ఇలవేల్పు వెంపర్తమ్మ జాతరను బుధవారం నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామంలో అమ్మవారి వెండి ఘటాన్ని గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మ వారికి పసుపు, కుంకుమ, నైవేధ్యం సమర్పించిన మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో పోతంశెట్టి వెంకటరెడ్డి, పోతంశెట్టి తాతారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పసలపూడి చిన్న తలుపులమ్మ, సోమేశ్వరం దేవాంగుల వీధిలో పోతురాజు తీర్ధం, లొల్ల బుల్లిబాపనమ్మ, గోగులమ్మ, కూర్మాపురంలో పోలేరమ్మ, చెల్లూరులో మద్దెమ్మ తల్లి, సత్మెమ్మ జాతరలు జరిగాయి.
వైభవంగా పత్తిపాటమ్మ జాతర
కపిలేశ్వరపురం: మండలంలోని కాలేరులో నున్న పత్తిపాటమ్మ జాతర బుధవారం వైభవంగా జరిగింది. జాతరలో భాగంగా గరగనృత్యాలు, విచిత్రవేషాలు, తీన్‌మార్ వాయిద్యాలు, బాజాభజంత్రీలతో పాటు బాణసంచా మధ్య జరిపారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఎర్రమిల్లి నాగవెంకట గురుచరణశర్మ ఆధ్వర్యంలో చండీహోమం జరిపారు. గురువారం ఆలయం వద్ద అమ్మవారి తీర్థం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా రావులమ్మ జాతర
ఆలమూరు: ఆలమూరు గ్రామదేవత రావులమ్మ అమ్మవారి జాతర మంగళవారం రాత్రి జరిగింది. గరగనృత్యాలు, పలు రకాల డప్పుల వాయిద్యాలు, బాణసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. గరగ నృత్యాల మధ్య అమ్మవారికి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి చెరువుగట్టున ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. పెదపళ్ల గ్రామదేవత పోలేరమ్మ జాతర, గవ్వ ఉత్సవాలు జరిపారు. గుమ్మిలేరు గ్రామదేవత ఉరదాలమ్మ జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్వర్యంలో పలు రకాల డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలతో ఘనంగా జరిపారు.