వాడపల్లి ఆలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:57 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆది వారం భక్తులు సందడి చేశారు.
ఆత్రేయపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆది వారం భక్తులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వేకువజామునే స్వామివారి స్నపన మూర్తులకు గోదావరి జలాలను తీర్ధపు బిందెతో తీసుకువచ్చి అభిషేకం చేశా రు. అనంతరం తిరుప్పావై వేద పారాయణం చేసి దర్శనాలకు అనుమతించారు. నోము ఆచ రించిన భక్తులు అష్టోత్తర పూజలు చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మహేశ్వరరావు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, ఉంగుటూరి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ ఉపకమీషనరు నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందించారు.
గోదా రంగనాథుల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం లో భోగి సందర్భంగా గోదా రంగనాఽథుల కల్యాణం నిర్వహించనున్నారు. నెల రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహించారు. సోమవారం గోదా రంగనాథుల కల్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు ముగియనున్నాయి. గోదా కల్యాణానికి 1700 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్టు పొంది హాజరుకానున్నారు. శ్రీనివాస ప్రాంగణంలో కల్యాణ వేదికను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భారీ సెట్టింగ్‌తో కల్యాణంలో పాల్గొనేలా టెంట్లు ఏర్పాటు చేశారు. ఖండవిల్లి వరప్రసాదచార్యులు బ్రహ్మత్వంలో గోదా కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లు నిర్వహించారు.
150 అడుగుల భోగిదండ: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భోగి వేడుకలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఈ పండుగలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు భోగి మంటను వెలిగించనున్నారు. గోక్షేత్రంలోని ఆవుపేడతో 150 అడుగుల భోగి దండను తయారు చేసి ఆలయం వద్ద భోగి మంటలో వేయనున్నారు. ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు వీటి ఏర్పాట్లు చేపడుతున్నారు.