Share News

Chittoor: దోపిడీకొచ్చి దొరికిపోయారు

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:26 AM

డమ్మీ తుపాకులతో ఓ షాపులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయారు. దివాళా తీసిన ఒక వ్యాపారే ఈ దోపిడీ ప్రయత్నానికి సూత్రధారి కావడం గమనార్హం.

Chittoor: దోపిడీకొచ్చి దొరికిపోయారు

చిత్తూరులో డమ్మీ తుపాకులతో చోరీ యత్నం

  • స్థానికుల అప్రమత్తతతో ప్లాన్‌ విఫలం

  • పోలీసుల అదుపులో ఐదుగురు

  • పరారీలో మరో ఇద్దరు దొంగలు

  • దివాలా తీసిన వ్యాపారే సూత్రధారి

  • మరో వ్యాపారిని దోచుకునే ప్రణాళిక

చిత్తూరు, అనంతపురం క్రైం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): డమ్మీ తుపాకులతో ఓ షాపులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయారు. దివాళా తీసిన ఒక వ్యాపారే ఈ దోపిడీ ప్రయత్నానికి సూత్రధారి కావడం గమనార్హం. మరో షాపు యజమానిని దోచుకునేందుకు వేర్వేరు జిల్లాల నుంచి ఆరుగురిని రప్పించి రంగంలోకి దిగాడు. వీరిలో ఐదుగురు పోలీసుల అదుపులో ఉండగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు నగరం గాంధీరోడ్డులో చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి చాలా ఏళ్లుగా ‘పుష్ప కిడ్స్‌ వరల్డ్‌’ షాపును నిర్వహిస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ఆయన నివాసం కూడా ఆ షాపు ఉన్న భవనంలోనే ఉంది. కాగా, చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని ఎస్‌ఎల్‌వీ ఫర్నిచర్స్‌ షాపు యజమాని సుబ్రమణ్యం మోసాలు చేస్తూ, ఐపీలు పెడుతూ కుదేలైపోయాడు. దీంతో చంద్రశేఖర్‌ రెడ్డిని దోచుకుందామని పథకం వేసిన సుబ్రమణ్యం తనకు పరిచయమున్న ఆరుగురిని అనంతపురం, నంద్యాల ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయం చిత్తూరుకు రప్పించాడు. అప్పటికే మూడు డమ్మీ తుపాకులు, 15 డమ్మీ బుల్లెట్లు, గ్లౌజులు, మాస్కులు, కారం పొడి, నాలుగైదు కత్తులు కొనుగోలు చేశాడు. చంద్రశేఖర్‌ రెడ్డి ఎన్ని గంటలకు షాపు తెరుస్తారు, సిబ్బంది ఎన్ని గంటలకు వస్తారు తదితర సమాచారాన్ని సుబ్రమణ్యం తెలుసుకున్నాడు. ప్రణాళికలో భాగంగా సుబ్రమణ్యం సహా ఏడుగురు బుధవారం ఉదయం 6.20 గంటలకు పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ దుకాణం ఎదుట ఓమ్నీ వ్యాను నిలిపి నేరుగా రెండో ఫ్లోర్‌లోకి వెళ్లి చంద్రశేఖర్‌ రెడ్డిని తుపాకులతో బెదిరించి డబ్బు, నగలు ఇవ్వాలని బెదిరించారు. చంద్రశేఖర్‌ రెడ్డి వెంటనే మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని బిగ్గరగా కేకలు పెట్టడంతో బయట ఉన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. ఏడుగురు దుండగులు లోపలికి వెళ్లే సమయంలోనే పక్కనున్న టీ షాపులోని కొందరు వ్యక్తులు గమనించారు. చంద్రశేఖర్‌ కేకలతో వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. 15-20 నిమిషాల వ్యవధిలోనే సుమారు 50-60 మంది స్థానికులు అక్కడ గుమికూడారు. దొంగలు పారిపోకుండా వారంతా భవనాన్ని చుట్టుముట్టారు. అయితే, తప్పించుకునేందుకు దొంగలు పక్కనున్న పాత భవనంపైకి దూకేశారు. 15 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. వారిలో నలుగురు దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ముగ్గురు పారిపోయారు. ఆ ముగ్గురిలోనూ ఒకరిని అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లె- ములకలచెరువు మధ్య అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సుబ్రమణ్యంతోపాటు వ్యాను నడిపిన సంపత్‌, నవీన్‌, రాజశేఖర్‌, ఇబ్రహీమ్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. పరారీలో ఉన్న ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.


బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లతో పోలీసులు..

స్థానికుల సమాచారంతో చిత్తూరు ఎస్పీ మణికంఠ సహా పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, చేతిలో పిస్టల్స్‌ పట్టుకుని రంగంలోకి దిగారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఆపరేషన్‌ పూర్తయింది. నలుగుర్ని అదుపులోకి తీసుకున్న తరువాత ఇంకా ముగ్గురు లోపలే ఉన్నారనే అనుమానంతో తిరుపతి ఆక్టోపస్‌ యూనిట్‌ రంగంలోకి దిగి పోలీసుల సహకారంతో ఆపరేషన్‌ను పూర్తిచేసింది. కాగా, కీలక నిందితుడు సుబ్రమణ్యం నంద్యాల జిల్లా కేంద్రంలో ఐపీ పెట్టి పలువురిని మోసం చేసినట్టు సమాచారం.


దొంగల్లో ముగ్గురు అన్నదమ్ములు!

  • వారి తండ్రి రౌడీషీటర్‌

చిత్తూరులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలలో ముగ్గురు అనంతపురం జిల్లావాసులు ఉన్నట్టు తెలిసింది. జిల్లాలోని వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామానికి చెందిన దొమ్మర రామాంజినేయులు, దొమ్మర రాజశేఖర్‌, దొమ్మర నెట్టికల్లు ఏడేళ్ల క్రితమే తల్లిదండ్రులతో కలిసి అనంతపురం నగరానికి వచ్చారు. రామాంజినేయులు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాజశేఖర్‌, నెట్టికల్లు అనంతపురం మార్కెట్‌యార్డులోని కూరగాయల మార్కెట్‌లో కూలి పనులు చేస్తుంటారు. వీరి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు ఇప్పటికీ వజ్రకరూరు మండల పరిధిలోనే ఉన్నాయి. అప్పుడప్పుడు స్వగ్రామానికి వెళ్లి వస్తుంటారు. ఈ ముగ్గురిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులూ లేవు. కానీ, వీరి తండ్రి దొమ్మర రామకృష్ణపై వజ్రకరూరు పోలీ్‌సస్టేషన్‌లో 2012లో రౌడీషీట్‌ నమోదైంది. పలు హత్య కేసుల్లో రామకృష్ణ నిందితుడు. ఈ రెండు కేసులనూ కొట్టివేశారు.

Updated Date - Mar 13 , 2025 | 03:26 AM