Greenko Renewable Energy: గ్రీన్‌కో ప్రాజెక్టు అద్భుతం
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:55 AM
కర్నూలు జిల్లాలో గ్రీన్‌కో నిర్మిస్తున్న 6,680 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న రీన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. ఇది సోలార్, విండ్, జల విద్యుత్ కేంద్రాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో తొలి ప్రాజెక్టు కావడం విశేషం
ఒకేచోట సోలార్, విండ్, జల విద్యుత్ కేంద్రాలు మోదీ, బాబు నాయకత్వానికి నిదర్శనం
కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్
కర్నూలు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో భారత్ ప్రగతి పథాన దూసుకుపోతూ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచిందని, త్వరలో మూడో స్థానానికి కూడా చేరుకుంటుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితంతండా, పాణ్యం మండలం పిన్నాపురం ప్రాంతాల్లో గ్రీన్‌కో కంపెనీ 6,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. త్వరలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రహ్లాద్‌జోషి శుక్రవారం ఆ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు టన్నెల్, టర్బైన్లను పరిశీలించారు. అంతకుముందు ఓర్వకల్లు మండలం గని గ్రామ ప్రాంతంలో నిర్మించిన సోలార్ ప్రాజెక్టును గ్రీన్‌కో కంపెనీ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అప్పర్ డ్యాం, లోయర్ డ్యాం, టన్నెల్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు ఇదే కావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇందుకు కృషి చేసిన ఎండీ అనిల్, ఇంజనీర్లను ప్రశంసించారు
. ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఇదేనన్నారు. ఒకే ప్రాంతంలో సోలార్, విండ్, జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడం గొప్పతనమన్నారు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని అటవీ భూముల్లో దేశానికి గర్వకారణమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం మోదీ,చంద్రబాబుల దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని, బాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఓర్వకల్లు ప్రాంత ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, మరిన్ని అనుబంధ పరిశ్రమలు రాబోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, నిల్వ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. అనంతరం నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.