Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:01 PM
సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పదో తరగతి విద్యార్థులంతా సోమవారం జరిగే పరీక్షలకు హాజరుకావాలని, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

అమరావతి: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి భయాలూ లేకుండా విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని లోకేశ్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి సకాలంలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిడికీ గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. సంవత్సరం పాటు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే సమయం ఇదేనని అన్నారు. ప్రశాంతంగా ఉండాలని, పరీక్ష కేంద్రాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్ చెప్పారు. సమయాన్ని వృథా కాకుండా టైమ్ మేనేజ్మెంట్ చేయాలని, సకాలంలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేలా దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రాల్లో ఇప్పటికే అన్నీ సౌకర్యాలు కల్పించామని, ఎండాకాలం నేపథ్యంలో మంచినీరు సహా ఇతర సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
కాగా, సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం విద్యాశాఖ అధికారులు 3,450 పరీక్షా కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఉదయం 9:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:45 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ చేశారు.
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ పరీక్షలు అయ్యేంత వరకూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది విద్యార్థులు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ సైతం ప్రకటించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా బస్సు ఎక్కొచ్చని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..
CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం