Share News

Weather Alert: ఈ 3 నెలలూ మంటలే

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:53 AM

భారత వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో సాధారణాన్ని మించిన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. హీట్‌వేవ్‌ ప్రభావం ప్రధానంగా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా ఉండనుంది

Weather Alert: ఈ 3 నెలలూ మంటలే

  • పెరగనున్న పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు

  • సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు

  • అనేకచోట్ల 45 డిగ్రీలు, కొన్నిచోట్ల అంతకుమించి

  • హీట్‌వేవ్‌ జోన్‌లో అనేక రాష్ట్రాలు

  • వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం: ఐఎండీ

  • ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే రెండు నెలల నుంచి ఎండలు, వడగాడ్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న మూడు నెలల్లో కూడా ఎండ తీవ్రత, వడగాడ్పులు అంతకుమించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదుకానున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా హీట్‌వేవ్‌ జోన్‌లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల వేసవి సీజన్‌కు సంబంధించి సోమవారం భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. మూడు నెలల సీజన్‌లో దక్షిణ భారతంలో పడమర ప్రాంతాలు, తూర్పు భారతం, దానికి ఆనుకుని మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప.. దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతం, దానికి ఆనుకుని దక్షిణాది రాష్ట్రాల్లో వడగాడ్పులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతంలో సగటు కంటే ఎక్కువగా వడగాడ్పులు వీస్తాయి. సాధారణంగా ఈ సీజన్‌లో నెలకు ఐదు నుంచి ఆరు రోజులు వడగాడ్పులు తీవ్ర వడగాడ్పులు వీస్తాయి.


అటువంటిది ఈ ఏడాది ఈ మూడు నెలల సీజన్‌లో ఐదు నుంచి ఎనిమిది రోజులు గాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్‌ వరకు చూస్తే పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇంకా వడగాడ్పులు తీవ్రంగా ఉండడంతో పాటు సాధారణం కంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయి. ఏప్రిల్‌లో దక్షిణ, పడమర, తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, దేశంలోని మిగతా ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం నమోదుకానుంది. ఏప్రిల్‌లో దేశంలో 39.2 మి.మీ. వర్షపాతం నమోదుకావాలి. గడచిన రెండు నెలల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షం జాడ లేకపోడంతో నేల పొడిగా మారిందని, దాంతో ఎండలు, గాడ్పులు పెరిగాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల మేరకు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో హీట్‌వేవ్‌ కోర్‌ జోన్‌లో 10 అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మార్చిలో అనేకచోట్ల 40 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు నెలల కాలంలో అనేకచోట్ల 45 డిగ్రీలు, అక్కడక్కడా మరింత ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు నెలల్లో ఎండలు, వడగాడ్పుల ప్రభావం నుంచి తట్టుకునేలా కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు వేసవి ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులుపడే వ్యక్తులు మరింత అప్రమ్తతంగా ఉండాలని హెచ్చరించింది. ఎక్కువగా చలువ కేంద్రాలు ఏర్పాటుతోపాటు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం, ఎండలు, గాడ్పుల వల్ల ఇబ్బందులపై హెచ్చరికలు జారీచేయడం, నగరాల్లో అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌ను గుర్తించి చలువ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలని భారత వాతావరణ శాఖ సూచించింది.


ఇలా చేయండి..

  • రానున్న మూడు నెలలు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

  • ఎండ, వడగాలి ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత ఇంట్లోనే ఉండాలి. వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్‌, కూలర్లు, ఏసీలు వినియోగించాలి.

  • ఇంట్లో ఉన్నా, దాహం వేయకపోయినా తరచూ నీరు తాగా లి. సాయంత్రం, రాత్రి వేళ చన్నీటితోనే స్నానం చేయాలి.

  • ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ నీళ్లు, కొబ్బరి నీరు తీసుకోవాలి.

  • ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తెల్లటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవాలి. లే దా రుమాలు కట్టుకోవాలి. కళ్లద్దాలు పెట్టుకోవాలి.

  • ఎండలో నుంచి వచ్చిన వెంటనే మంచినీరు/ నిమ్మరసం, మజ్జిగ తాగాలి.

  • ఎండలో బయటకు వెళ్లినప్పుడు తలతిరగడం వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. వడదెబ్బగా గుర్తించి, వెంటనే వైద్యులను సంప్రదించాలి.


ఇవి చేయొద్దు!

  • ఎండ, వేడి వాతావరణం ఉన్నప్పుడు బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు, వయో వృద్ధులు బయట తిరగకూడదు.

  • బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎండలో తిరగరాదు.

  • ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె, పంచదార వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు.

  • ఎండలో బయటకు వెళ్లినప్పుడు శీతల పానీయాలు, ఐస్‌ లు, ఆల్కహాల్‌, టీ, కాఫీ, కార్బొనేటెడ్‌ డ్రింక్‌లు తాగడం మానుకోవాలి.

  • అధిక ప్రొటీన్‌, ఉప్పు, కారం, నూనె వస్తువులు తీసుకోకూడదు.

Updated Date - Apr 01 , 2025 | 04:55 AM