Political Silence : జగన్ దొంగాట
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:50 AM
సార్వత్రిక ఎన్నికల తరువాత అనేక కీలకమైన విషయాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనుకాడుతున్నారు.

డీఎంకే ఆహ్వానంపై మౌనం
ప్రధాని మోదీకి లేఖ అంటూ ప్రచారం
లేఖలోనూ డీలిమిటేషన్‌పైనిర్ద్వంద్వ వైఖరిని వెల్లడించని వైనం
ఎస్సీ వర్గీకరణపైనా అటూఇటూ కాని ధోరణే
అమరావతి, మార్చి 22(అమరావతి): సార్వత్రిక ఎన్నికల తరువాత అనేక కీలకమైన విషయాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనుకాడుతున్నారు. నిర్మొహమాటంగా ప్రకటించాల్సిన అంశాలపై కూడా కప్పదాటు ధోరణిని అవలంభిస్తున్నారు. చట్టసభల్లో, పార్టీ వేదికలపై రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశాలపై తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించడం లేదు. వివిధ రాజకీయ పార్టీలు ఎంత కవ్వించినా జగన్ మాత్రం పెదవి విప్పడం లేదు. తన పార్టీ నేతలను కూడా ఆయా కీలకాంశాలపై మాట్లాడవద్దంటూ కట్టడి చేశారు. తమ నాయకుడిని ‘సింహం’ అంటూ పిలుచుకున్న పార్టీ ముఖ్య నేతలెందరో తాజా పరిణామాలపై జగన్ ధోరణి చూసిన తరువాత ‘మా నాయకుడు ఇంత పిరికివాడా..!’ అంటూ కలత చెందుతున్నారు.
డీఎంకే ఆహ్వానాన్నీ చెప్పుకోలేని దుస్థితి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోందన్న వార్త రాజకీయ వర్గాల్లో కలకలానికి, తీవ్ర చర్చకు దారితీసింది. దక్షిణాదిలోని పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే దీనిపై తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఈ విషయంలో డీఎంకే ఓ అడుగు ముందుకేసింది. చెన్నైలో బీజేపీయేతర రాజకీయ పక్షాలతో శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రావాలంటూ వైసీపీతోపాటు టీడీపీ, జనసేనలకూ ఆహ్వానం పంపింది. ‘మేం బీజేపీతో పొత్తులో ఉన్నాం. మేం ఈ సమావేశంలో పాల్గొనలేం. మా అభిప్రాయాన్ని సరైన వేదికపై వెల్లడిస్తాం’ అంటూ టీడీపీ, జనసేన పేర్కొన్నాయి. వైసీపీ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం దాల్చింది. కనీసం డీఎంకే నుంచి ఆహ్వానం అందిందన్న విషయాన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడింది.
ఈ తంటాలన్నీ బీజేపీ అగ్రనేతలను... ప్రధానంగా మోదీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకోవడానికేనంటూ రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. శనివారం డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి కనిమొళి మాట్లాడుతూ, ‘వైసీపీతో మాకు సత్సంబంధాలున్నాయి. రాజకీయంగా జగన్ మాకు మిత్రుడే. వచ్చే సమావేశాలకు వైసీపీ హాజరవుతుంది’ అని ప్రకటించారు. ఈ ప్రకటన జగన్ రాజకీయ అస్పష్ట వైఖరిని ప్రపంచానికి చాటింది. డీలిమిటేషన్ అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని గ్రహించిన జగన్... ఈ విషయంపై తన వైఖరిని తేటతెల్లం చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఒక వేళ పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడినా అది తన, పార్టీ వైఖరిగానే బీజేపీ నేతలకు చేరుతుందని భావించిన ఆయన వారి నోళ్లకూ తాళం వేశారు. బీజేపీ ‘గుడ్‌లుక్స్’ కోసం తాపత్రయపడుతున్న విషయానికి ముసుగు వేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డీఎంకే నుంచి తమకు ఆహ్వానం వచ్చిన విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా, కేవలం ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ రాసిన లేఖను మాత్రమే పార్టీ వేదికగా ప్రచారం చేసుకోవడాన్ని ఈ కోణంలోనే చూడాలని వారు వివరిస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణపైనా అంతే...
జగన్ అస్పష్ట ధోరణి పునర్విభజనకే పరిమితం కాలేదు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికపైనా తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ‘మండలిలో ప్రవేశపెడితే వ్యతిరేకిస్తాం’ అన్నంత వరకే పరిమితమయింది. ఈ అంశంపై తమ పార్టీ వైఖరిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఆయన చేసిన ప్రకటన వైసీపీ వైఖరిపై మరింత గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించింది. ఏకసభ్య కమిషన్ సిఫారసులకు మద్దతు ఇస్తున్నామనో, ఇవ్వడం లేదనో చెప్పకుండా... సభలో బిల్లు పెడితే తాము అనుసరించే పద్ధతుల గురించి మాత్రమే మాట్లాడారు. సమస్య ఉందో లేదో తేల్చుకోవడం, ఉంటే పరిష్కారాన్ని మాట్లాడడమన్న నేరు పోకడలకు వైసీపీ దూరంగా జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే మాలలకు, ఇవ్వకపోతే మాదిగలకు దూరం అవ్వాల్సి వస్తుందేమో అన్న భయంతో ఎటూ తేల్చకుండా తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నారు. జగన్ తీసుకుంటున్న ఈ అస్పష్ట, అనిర్దిష్ట వైఖరులు రాబోయే కాలంలో రాజకీయ ప్రతిబంధకాలుగా మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రధానికి జగన్ రాసిన లేఖ సారాంశం
నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలోని ఏ రాష్ట్రమూ నష్టపోకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు. ఆయన రాసిన మూడు పేజీల లేఖలో... ‘గత 15 సంవత్సరాలు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గుతోంది. జనాభా నియంత్రణ కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు నిజాయితీగా అమలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జనాభా ప్రాతిపదికన చేసే డీలిమిటేషన్ ప్రక్రియతో పలు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న భయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారి సెంటిమెంట్‌ను గౌరవించాలి. లోక్‌సభలో ఏ రాష్ట్రమూ తమ ప్రాతినిధ్య బలాన్ని కోల్పోకుండా అవసరమైతే 84వ రాజ్యాంగ సవరణ చేపట్టాలి. డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టే ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి’ అని జగన్ అభ్యర్థించారు.