Share News

AP Chief Secretary : సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:51 AM

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ అమరావతి సచివాలయంలో మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

AP Chief Secretary : సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ

  • సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ అమరావతి సచివాలయంలో మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మంగళవారమే సీఎ్‌సగా పదవీ విరమణ చేసిన నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌.. విజయానంద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా.. ప్రత్యేక సీఎస్‌లు జి.సాయిప్రసాద్‌, కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, జీఏడీ కార్యదర్శి సురేష్‌ కుమార్‌, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు నూతన సీఎ్‌సను కలిసి పుప్పగుచ్ఛాలు అందించారు. బాధ్యతలు చేపట్టాక విజయానంద్‌ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ 1993లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. సబ్‌ కలెక్టర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. 2019-21 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. 2023 నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు. విద్యుత్‌ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Updated Date - Jan 01 , 2025 | 04:51 AM