Share News

మల్లవల్లిపై మరో ముందడుగు

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:25 AM

మల్లవల్లిలోని బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు(మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు) లో పరిశ్రమలు నెలకొల్పే దిశగా మరో ముందడుగు పడింది.

మల్లవల్లిపై మరో ముందడుగు

యుద్ధప్రాతిపదికన రోడ్లు, విద్యుత్తు, మౌలిక సదుపాయాల పనులు

పరిశ్రమల స్థాపనపై పెట్టుబడిదారులతో ‘ఏపీఐఐసీ’ సమావేశం

అగ్రిమెంట్లు చేసిన నెలలోనే యూనిట్లు నెలకొల్పుతామన్న పెట్టుబడిదారులు

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మల్లవల్లిలోని బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు(మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు) లో పరిశ్రమలు నెలకొల్పే దిశగా మరో ముందడుగు పడింది. గత ఐదేళ్లూ జగన్‌ సర్కారు వేధింపుల కార ణంగా యూనిట్లు నెలకొ ల్పకుండా వారు వదిలేసిన సంగతి తెలిసిందే. గత జూన్‌లో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ పారిశ్రామికవాడకు మంచి రోజులు వచ్చాయి. సమస్యలను పరిష్కరించడంతోపాటు త్వరలోనే పరిశ్రమలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయు డు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పారిశ్రామికవాడలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో 349 మంది పారిశ్రామికవేత్తలకు పాత ధరల ప్రకారం అంటే ఎకరం రూ.16.50 లక్షలకే కేటాయించేందుకు అక్టోబరులోనే రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పథకం కింద మల్లవల్లి పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాల కల్పన పనులకు రూ.1,000 కోట్ల రుణానికి ప్రభుత్వం హ్యాండ్‌ హోల్డింగ్‌ ఇచ్చింది. దాం తో మల్లవల్లి పార్కులో పారిశ్రామికాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పరిశ్రమలు నెలకొల్పేందుకు మౌలిక సదుపాయాల కల్పన పనులను ఏపీఐఐసీ అధికారులు దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటికే రోడ్లు, విద్యుత్తు లైన్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. దీంతో వీలైనంత త్వరగా పరిశ్రమలను కూడా నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో ప్లాట్లు పొందిన పారిశ్రామికవేత్తలందరితో ఏపీఐఐసీ అధికారులు శనివారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రచ న, చీఫ్‌ ఇంజినీర్‌ సీతారాం, విజయవాడ జోనల్‌ మేనేజరు బాబ్జీ సమావేశానికి హాజరయ్యారు. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో కేటాయించిన ప్లాట్లలో వెంటనే పరిశ్రమలను నెలకొల్పేందుకు సిద్ధం కావాలని పారిశ్రామికవేత్తలను వారు కోరారు. పాత ధరలకే ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసి అగ్రిమెం ట్లు చేసిన వెంటనే పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌, ఎస్‌ఏపీ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌, నవ్యాంధ్ర ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌, మల్లవల్లి స్మాల్‌ అండ్‌ మీడియం ఇండస్ట్రీస్‌ అసోసియేషన్ల ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ల తరఫున జీఎన్‌ బీ చౌదరి, సాయికిషోర్‌, పున్నయ్య, ఆనందరావు, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు మాట్లాడారు. గతంలో తాము సమర్పించిన డీపీఆర్‌లను ఐదేళ్లలో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. పరిశీలిస్తామని ఏపీఐఐసీ అధికారులు హామీ ఇచ్చారు.

వచ్చే నెల నుంచే యూనిట్లు నెలకొల్పే పనులు

ఏపీఐఐసీ అధికారులు తమకు ప్లాట్లు అప్పగించి అగ్రిమెంట్లు వెంటనే పూర్తి చేస్తే వచ్చే నెల నుంచే యూనిట్లను నెలకొల్పేందుకు పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏడాదిలోగానే అన్ని యూనిట్లను నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించేలా మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ తరపున చూస్తాం. ఈ పార్కులో దాదాపు 150 ఎకరాల్లో 292 మంది పారిశ్రామికవేత్తలు రూ.960 కోట్ల పెట్టుబడితో వివిధ పరిశ్రమలను నెలకొల్పేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంది. పరిశ్రమల ద్వారా 8,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యలను పరిష్కరించి పాత రేట్ల ప్రకారం మళ్లీ భూములు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. మేముకూడా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.

- జీఎన్‌బీ చౌదరి, మల్లవల్లి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

Updated Date - Jan 12 , 2025 | 01:25 AM