అల్లుడి దాడిలో అత్త మృతి
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:17 AM
న కుమార్తెను పాఠశాలకు వెళ్లకుండా మాన్పించి, షాపింగ్ మాల్‌లో పనికి చేర్పించారంటూ అత్తపై అల్లుడు దాడి చేశాడు. దీంతో అత్త అక్కడికక్కడే మృతి చెందింది.
పోరంకి ప్రభునగర్‌లో ఘటన..కేసు నమోదు
పెనమలూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తన కుమార్తెను పాఠశాలకు వెళ్లకుండా మాన్పించి, షాపింగ్ మాల్‌లో పనికి చేర్పించారంటూ అత్తపై అల్లుడు దాడి చేశాడు. దీంతో అత్త అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు పరారయ్యాడు. ఈఘటన పోరంకి ప్రభునగర్ శ్రీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తన భర్త నరే్‌ష(తెలంగాణ)తో విభేదాల కారణంగా నారబోయిన స్వర్ణలత పోరంకి ప్రభునగర్ శ్రీనగర్ కాలనీలోని తన తల్లి రాణి వద్ద రెండేళ్లుగా ఉంటోంది. కుమార్తెను ఉయ్యూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివించేవారు. కొంతకాలం క్రితం చదువు ఇష్టంలేదని కుమార్తె బడికి వెళ్లడం మానేసి, తల్లి స్వర్ణలత, అమ్మమ్మ రాణితో కలిసి ఇంటివద్దనే ఉంటోంది. దీంతో నరేష్ తన కుమార్తెను చదువు మాన్పించి పనిలో పెడతారా అంటూ అనేకసార్లు ఇంటికి వచ్చి గొడవ పడుతుండేవాడు. గురువారం తెల్లవారుజామున అత్త రాణి బ్రష్ చేసుకుంటుండగా ఆకస్మాత్తుగా నరేష్ ఇంట్లోకి వచ్చాడు. తన కుమార్తెను బడికి పంపకుండా మాన్పించేస్తారా.. పొలాన్ని కూతురు పేర రాయమంటారా? అని గొడవ పెట్టుకున్నాడు. బూతులు తిడుతూ పక్కనే ఉన్న కర్రతో రాణి తలపై బలంగా మోదాడు. ఆ దెబ్బకు రాణి కింద పడిపోయింది. అత్తపై కూర్చుని రాయితో తలపై బలంగా కొడుతుండడంతో రాణి పెద్దగా అరిచింది. అరుపులు విన్న కూతురు స్వర్ణలత బయటికి వచ్చి చూసేసరికి రాణి కింద పడిపోయి ఉంది. స్వర్ణలతను తోసుకుంటూ నరేష్ బయటకు పరారయ్యా డు. స్థానికులు 108కు ఫోన్ చేసి విజయవాడ జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు పరీక్షించి రాణి అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నరేష్ కోసం గాలిస్తున్నారు.