సంక్రాంతి బిజీనెస్
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:12 AM
సంక్రాంతి షాపింగ్‌ల సందడి తారస్థాయికి చేరింది. వారం రోజులుగా నగరంలోని వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి. చిన్నచిన్న వస్త్ర దుకాణాల నుంచి భారీ షోరూమ్‌లు, మల్టీప్లెక్స్ స్టోర్‌ల వరకు అన్నీ కళకళలాడుతున్నాయి.
కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్
రద్దీగా మారిపోయిన బీసెంట్ రోడ్డు
లెనిన్‌సెంటర్, బందురు రోడ్డుల్లోనూ ఇదే పరిస్థితి
మల్టీప్లెక్స్ మాల్స్‌లోని షాపులూ కిటకిట
పండుగ నేపథ్యంలో భారీ ఆఫర్ల ప్రకటన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సంక్రాంతి షాపింగ్‌ల సందడి తారస్థాయికి చేరింది. వారం రోజులుగా నగరంలోని వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి. చిన్నచిన్న వస్త్ర దుకాణాల నుంచి భారీ షోరూమ్‌లు, మల్టీప్లెక్స్ స్టోర్‌ల వరకు అన్నీ కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది పది రోజుల పాటు సెలవులు రావటం, దూరప్రాంతాల నుంచి బంధువులు వస్తుండటం, సకుటుంబ సమేతంగా సొంతూర్లకు వెళ్తుండటంతో అందరికీ పండుగ దుస్తులు కొనేందుకు షాపులకు తరలివస్తున్నారు. బీసెంట్ రోడ్డు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ఉమ్మడి కృష్ణాజిల్లానే కాకుండా కోస్తా జిల్లాల నుంచి కూడా బీసెంట్ రోడ్డుకు షాపింగ్ కోసం వస్తున్నారు. ఆ తర్వాత లెనిన్ సెంటర్‌లో కూడా ఆ స్థాయిలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. బందరు రోడ్డు అయితే, సంక్రాంతికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. కార్పొరేట్ వస్త్ర దుకాణాలన్నీ బందరు రోడ్డుపైనే ఉన్నాయి. ఈ మాల్స్ అన్నీ భారీగా పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ఎమ్మార్పీపై 50 నుంచి 60 శాతం మేర తగ్గింపును ప్రకటించడంతో పాటు కొనుగోలుపై బహుమతులు అందజేస్తున్నారు. రూ.5 వేలు షాపింగ్ చేసిన వారికి వాచీలు, కుక్కర్లు, స్మార్ట్‌ఫోన్లు, డైనింగ్ కిట్స్ ఇస్తున్నారు. ఇక మాల్స్‌ను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మల్టీప్లెక్స్ మాల్స్‌లోని వస్త్ర దుకాణాల్లో కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ఎంత కొంటే అంత ఫ్రీ అని ప్రకటించ టంతో ఈ మాల్స్ నిత్యం కిటకిటలాడుతున్నాయి. రిలయెన్స్ మాల్స్‌లో రూ.2,500 కొంటే రూ.2,500 విలువచేసే దుస్తులు ఉచితంగా ఇచ్చే ఆఫర్లు ప్రకటించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, పండుగకు రెండు రోజుల ముందు షాపింగ్‌లు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.