Share News

YVS Choudary.. నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం: వైవీఎస్ చౌదరి

ABN , Publish Date - Jan 26 , 2025 | 07:17 AM

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం తన తండ్రి, గురువు, దర్శకుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, లెజెండరీ ఎన్టీఆర్‌కు నిజంగా గర్వించదగిన క్షణమని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. భారతీయ సినిమాకు, సమాజానికి బాలకృష్ణ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

YVS Choudary.. నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం: వైవీఎస్ చౌదరి

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు పద్మభూషణ్ అవార్డ్ (Padma Bhushan Award) వరించినందున తెలుగు వారికి, తెలుగు సినిమాకి, ఆయన కుటుంబ సభ్యులు.. ఇంకా నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణమని (Important Moment) ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (YVS Choudary) అన్నారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ఇది తన తండ్రి, గురువు, దర్శకుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నట రత్న, పద్మశ్రీ, లెజెండరీ ఎన్టీఆర్‌కు నిజంగా గర్వించదగిన క్షణమని అన్నారు. భారతీయ సినిమాకు, సమాజానికి నందమూరి బాలకృష్ణ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బాలకృష్ణ హీరోగా తన 50 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకున్న నేపధ్యంలో నందమూరి అభిమానులకు ఈ వార్త మరింత ఆనందాన్ని కలిగించిందని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.

ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులు వచ్చాయని, పద్మభూషణ్‌ అవార్డు నందమూరి బాలకృష్ణకు రావడం హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు. ‘భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా అభినందనీయం... ఇతర ప్రముఖ తెలుగు, భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు’.. అంటూ ఎస్ ఎస్ రాజమౌళి వ్యాఖ్యానించారు.


పద్మ’ పురస్కార గ్రహీతలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు...

‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యరంగంలో అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, అలాగే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నటులు, ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా సామాజిక సేవారంగంలో ఉన్న నందమూరి బాలకృష్ణ, పద్మశ్రీకి ఎంపికైన సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, దళిత నాయకుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, ఇంకా విద్య, సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కెఎల్ కృష్ణకి, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ నటన, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలిచిన కళామతల్లి ముద్దుబిడ్డలు పద్మభూషణ్‌కు ఎంపికైన ఎస్ అజిత్ కుమార్, శోభన చంద్రకుమార్‌లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. బుర్రకథ కళాకారులు, జానపద కళాకారులను ఎందరినో తెలుగునేలకు అందించిన స్వర్గీయ మిరియాల అప్పారావు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించడాన్ని వారి సేవలకు దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి కొనియాడారు.


కాగా నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరో పక్క వైద్యరంగంలో సేవలు.. ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పని చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేషసేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్‌ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడెప్పుడో 1960ల్లో ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు.. కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. విజయానికి దగ్గిర దారులు వెదుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్‌ చెప్పడంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్‌ వాయి్‌సలో ఆయన తెరపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లి పోతుంటాయి. తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజజీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు. క్రమశిక్షణకు ప్రాణం ఇస్తారు బాలకృష్ణ. అలాగే ఆయనది ముక్కుసూటితత్వం. నాన్చుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పడం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం అలవాటు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నారు.


balakrishna.jpg

రాజకీయ నాయకుడిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు. మూడు సార్లు హిందూపరం శాసససభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించిన బాలకృష్ణ ప్రజా సేవలోనూ తన ముద్రను చాటారు. బాలకృష్ణకు సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినీ దిగ్గజం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. లెజండరీ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని నిలబెడుతూ... మీరు సినిమా, రాజకీయాలు, దాతృత్వంలో మేటిగా నిలిచారు. ప్రజా సంక్షేమానికి మీ అంకితభావం... ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా లెక్కలేనన్ని జీవితాలకు స్వాంతనను చేకూర్చింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ సేవలకు ఇది నిజమైన గుర్తింపు. దయాళువైన నేతకు తగిన గౌరవం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పద్మభూషణ్‌ అందుకున్న మీ అందరి బాలయ్య, నా ముద్దుల మావయ్య బాలకృష్ణకు అభినందనలు’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 07:25 AM