Share News

సాగు, తాగునీటి అవసరాలు తీర్చండి

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:40 AM

కృష్ణాజిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి.. ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సాగు, తాగునీటి అవసరాలు తీర్చండి
సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీ బాలశౌరి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి

మచిలీపట్నం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి.. ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎంపీ పలు విజ్ఞప్తులు చేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద కృష్ణాజిల్లాను యూనిట్‌గా పరిగణించి, ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందించేందుకు సహకరించాలని కోరారు. తద్వారా పంచాయతీలపై ఆర్థికభారం పడదని చెప్పారు. కృష్ణాడెల్టాలోని ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రకాశం బ్యారేజీ దిగువన పెనమలూరు మండలం చోడవరం, మోపిదేవి మండలం బండికోళ్లంక వద్ద కృష్ణానదిపై రెండు బ్యారేజీలను నిర్మించి నీటిని నిల్వ ఉంచే ందుకు డీపీఆర్‌ రూపొందించారని కోరారు. నాబార్డు నిధుల ద్వారా నాగాయలంక మండలంలో ఎదురుమొండి-ఏటిమొగల మధ్య కృష్ణానదిపై వారధి నిర్మాణం, కంకిపాడులోని మంతెన వద్ద బుడమేరుపై వంతెన నిర్మాణం, పెదపారుపూడి-పామర్రు మండలాలను కలుపుతూ యలమర్రు వద్ద పుల్లేరు కాల్వపై వంతెన, గూడూరు-కంకటావ గ్రామాల మధ్య పంటకాల్వపై వంతెన నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని, వాటికి అనుమతులు ఇచ్చి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులకు ఆమోదం తెలుపుతామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.

మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యులుగా మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సభ్యులుగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనాథ్‌ను నియమిస్తూ కేంద్రప్రభుత్వ కుటుంబ సంక్షేమశాఖ ఈనెల 13న ఉత్తర్వులు జారీచేసింది. వీరు ఈ ఆసుపత్రి అభివృద్ధిపై తరచూ సమీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంది.

Updated Date - Jan 16 , 2025 | 12:40 AM