స్పందన శూన్యం!
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:45 AM
ఎన్టీఆర్ జిల్లాలో రెండు లిక్కర్ మార్టులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ రెండు మార్టుల కోసం కేవలం రెండు దరఖాస్తులే వచ్చాయి.
నగరంలో 2 లిక్కర్ మార్టులకు రెండు దరఖాస్తులే
దరఖాస్తు ఫీజు రూ.15 లక్షలతో బెంబేలు
షాపు తెరవాలంటే రూ.5 కోట్లు పెట్టాల్సిందే
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఎన్టీఆర్ జిల్లాలో రెండు లిక్కర్ మార్టులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ రెండు మార్టుల కోసం కేవలం రెండు దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తు ఫీజు భారీగా ఉండటం, భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉండడమే దీనికి ప్రధాన కారణం. దరఖాస్తు ఫీజుగా రూ.15 లక్షలను నిర్ణయించి, రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోనే ఈ మార్టులను ఏర్పాటు చేసుకునేలా టెండర్లు పిలిచారు. వీటికి భారీ స్పందన ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావించారు. కానీ, విజయవాడలో రెండు మార్టులకు రెండే దరఖాస్తులు వచ్చాయి. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపు ఏర్పాటు చేయాలన్న నిబంధన కూడా వీటికి స్పందన కరువయ్యేలా చేసింది. నగరాల్లో అంత భారీగా స్థలం లభ్యం కావాలంటే రూ.50 లక్షలైనా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టెండరు పాడుకున్న తర్వాత ఎక్సైజ్ శాఖకు రూ.కోటి డిపాజిట్ రూపంలో చెల్లించాలి. మార్ట్‌లో అన్నీ ప్రీమియం బ్రాండ్లు ఉంచితేనే కస్టమర్లను ఆకర్షించగలరు. అంతస్థాయిలో స్టాక్ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ.2.5 కోట్లు వెచ్చించాలి. ఇతరత్రా ఖర్చుల రూపేణా మరో కోటి వరకు అవుతుంది. మొత్తం మీద షాపు ప్రారంభించాలంటే రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇంత చేసినా కమిషన్ ఎంత అనేదానిపై సందిగ్ధత నెలకొంది. 20 శాతం కమిషన్ అని ప్రభుత్వం చెబుతున్నా, వివిధ పన్నులు, సెస్సులకు పోగా అందులో సగం కూడా గిట్టుబాటు కాదని మద్యం దుకాణదారులు చెబుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం కమిషన్‌ను 14 శాతం గిట్టుబాటు అయ్యేలా చూస్తామని ప్రకటన చేసినా అది ఎప్పటి నుంచి అమలు అవుతుందనే ఆందోళన మద్యం వ్యాపారుల్లో ఉంది.