గ్రావెల్ దందా!
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:56 AM
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా క్వారీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, మైలవరంలోయథేచ్ఛగా గ్రావెల్, పోలవరం మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. వైసీపీ హయాంలో కనిపించిన కొండనల్లా పిండి చేసిన అక్రమార్కులు టీడీపీ హయాంలోనూ రెచ్చిపోతూ ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాయి.
పోలవరం మట్టి తవ్వేస్తున్నారు
ప్రజాప్రతినిధుల అనుచరులే సూత్రధారులు
కొత్త క్వారీలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం
అయినా తిరువూరు, మైలవరంలో జోరుగా తవ్వకాలు
గన్నవరం,నూజివీడు నియోజకవర్గాల్లో తమ్ముళ్ల పోరు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో రెచ్చిపోయిన మట్టి రాక్షసులు కూటమి ప్రభుత్వంలోనూ రూపం మార్చుకుని దోపిడీ సాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా నడుస్తోంది. సాక్షాత్తు ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అక్రమార్కులు గ్రావెల్ దందా సాగిస్తున్నారు. మరోవైపు గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పోలవరం మట్టి కోసం ప్రజాప్రతినిధుల అనుచరుల నడుమ యుద్ధం నడుస్తోంది. వైసీపీ హయాంలో కనిపించిన కొండనల్లా పిండి చేసిన అక్రమార్కులు టీడీపీ హయాంలోనూ రెచ్చిపోతున్నారు. నాడు వైసీపీ ముసుగులో దోపిడీ సాగిస్తే నేడు టీడీపీ ముసుగులో దందా నడిపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. మైలవరం మండలం వెదురుబీడెంలో వైసీపీ నాయకుడు ఒకరు గతంలో మూడు ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఈ ఒక్క క్వారీయే అధికారికంగా నడుస్తోంది. దాని నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్ పనులకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ క్వారీలో నిబంధనలకువిరుద్ధంగా సుమారు 20 అడుగుల మేర గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. 200 లారీల గ్రావెల్ తరలిస్తున్నారు. గత వారం రోజులుగా విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో స్థానిక వైసీపీ, టీడీపీ నాయకులు కలిసి పోలవరం కాల్వ మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాల్లో మట్టి తరలిపోతున్నా ఒక్క అధికారీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అరకొరగా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. పాతపాడు వద్ద కూడా పోలవరం మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తూరు తాడేపల్లిలోని వసంతరాయల తిప్ప(కొండ)ను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోని కొండపర్వలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన మామిడి తోటలో గుట్టుగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. వైసీపీ, టీడీపీ నాయకులు కలిసి గ్రావెల్ దందా నడిపిస్తుండటం గమనార్హం.
తమ్ముళ్ల నడుమ మట్టి చిచ్చు
గన్నవరం, నూజివీడు సరిహద్దు గ్రామాల్లో గ్రావెల్, పోలవరం మట్టి తవ్వకాలు, తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టుకుని పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నూజివీడు నుంచి గన్నవరంలోకి గ్రావెల్, మట్టితో వచ్చే లారీలను అడ్డుకుంటున్నారు. నూజివీడు నియోజకవర్గంలోని కనసానపల్లిలో ఆర్‌ఎస్ నంబరు 117 నుంచి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వి తరలించేస్తున్నారు. 2017-18లో ఈ క్వారీకి అనుమతి తీసుకున్నారు. ఏడు ఎకరాలకు అనుమతి తీసుకుని ప్రస్తుతం 14 ఎకరాల వరకు తవ్వేశారు. సమీపంలోని డీఫారం పట్టాలు సైతం కొనుగోలు చేసి అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారు. పాత రశీదులను చూపి, క్వారీయింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకున్నది లేదు. అక్కడ తవ్విన గ్రావెల్‌ను గన్నవరం నియోజకవర్గంలోని వెంచర్లకు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లోని వెంచర్లకు తరలిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో క్వారీయింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న లారీలను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. పైగా అక్రమ క్వారీయింగ్ చేసే వారంతా వల్లభనేని వంశీ అనుచరులు, గతంలో వైసీపీలో చురుగ్గా ఉన్న వారు కావడంతో గన్నవరం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కత్తులు నూరుతున్నారు.