బియ్యం మాయం కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:51 AM
మాజీమంత్రి పేర్ని నాని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న మేనేజర్ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా బాలాంజనేయులు, లారీడ్రైవర్ బోట్ల మంగారావును పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ఏ4ను అధిక సమయం ప్రశ్నించిన పోలీసులు
మిల్లు వద్దకు తీసుకెళ్లి వివరాల సేకరణ
బియ్యం కొన్న ఐదుగురిపై త్వరలో కేసు నమోదు
హైకోర్టు ఆదేశాల మేరకు నిందితులు మళ్లీ జైలుకు
మచిలీపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : మాజీమంత్రి పేర్ని నాని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న మేనేజర్ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా బాలాంజనేయులు, లారీడ్రైవర్ బోట్ల మంగారావును పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. మచిలీపట్నం సబ్‌జైలు నుంచి మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌కు శనివారం ఉదయం 10 గంటల సమయంలో తీసుకొచ్చారు. ఆర్‌పేట సీఐ ఏసుబాబు, సీఐలు నిందితులను విచారించారు. ఏ4గా ఉన్న మిల్లు యజమాని బాలాంజనేయులును ఎక్కువసేపు విచారించారు. పెడనలోని బాలాంజనేయులు నడుపుతున్న మిల్లు వద్దకు తీసుకెళ్లి.. అక్కడి పత్రాలను, ఇతరత్రా రికార్డులను తనిఖీ చేశారు. విచారణ ముగిశాక ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని సబ్‌జైల్లో అప్పగించారు. శనివారం రాత్రి ఏఎస్పీ వీవీ నాయుడు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బియ్యం మాయం కేసులో కస్టడీలోకి తీసుకున్న నిందితులను విచారించిన తీరు, ఈ కేసులో పురోగతి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. బియ్యం విక్రయించ డంలో కీలకపాత్ర పోషించిన మిల్లు యజమాని బాలాంజనేయులు ఖాతా నుంచి మానస్‌తేజ బ్యాంకు ఖాతాకు గతంలో రూ.23 లక్షలు జమ అయినట్లు గుర్తించగా, శనివారంవిచారణలో రూ.27 లక్షలుగా నిర్ధారించార. ఈ గోడౌన్ నుంచి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యాపారులు బియ్యం కొన్నట్లుగా నిర్ధారణ కాగా, వీరిపై కేసు నమోదు చేసిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపారు.
ఎందుకీ జాప్యం
బియ్యం మాయం కేసులో పోలీసుల వ్యవహారశైలి కొండను తవ్వి ఎలుకను పట్టిన ట్టుగా ఉంది. 378 టన్నుల బియ్యం మాయమైన కేసును త్వరితగతిన ఛేదించకుండా, పోలీసులు కావాలనే జాప్యం చేశారనే విమర్శలు వస్తున్నాయి. నిందితుల నుంచి నిజాలు రాబట్టడంలో కావాలనే కాలయాపన చేశారని టీడీపీ నాయకులు అరోపిస్తున్నారు. ఈ కేసును ఇలాగే సాగదీసి, నీరుగార్చేస్తారనే ప్రచారం మచిలీపట్నంలో జరుగుతోంది.