Share News

అత్యవసర సేవలకు అడ్డుగా..

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:54 AM

మచిలీపట్నంలోని మెడికల్‌ కళాశాల నిర్మాణానికి బాలారిష్టాలు తొలగట్లేదు. సెప్టెంబరు నుంచి 150 మంది విద్యార్థులతో ఇక్కడ ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమైనప్పటికీ కీలకమైన మౌలిక వసతులతో పాటు కళాశాలకు వెళ్లేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రైల్వేట్రాక్‌పై ఫ్లై ఓవర్‌ నిర్మాణం పెండింగ్‌లోనే ఉండిపోయింది. దీంతో ఈ కళాశాలకు రావాల్సిన అత్యవసర వైద్యసేవలు కలగానే మిగిలిపోయాయి.

అత్యవసర సేవలకు అడ్డుగా..
మెడికల్‌ కళాశాలకు వెళ్లే రహదారిలో రైల్వేట్రాక్‌

  • మచిలీపట్నం మెడికల్‌ కళాశాలకు అవరోధంగా రైల్వేట్రాక్‌

  • ఫ్లై ఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనలున్నా.. అమలు సున్నా..

  • కళాశాలకు వెళ్లాలంటే ట్రాక్‌ దాటాల్సిందే..

  • అత్యవసర వైద్యసేవలు అందని దుస్థితి

  • వంతెన నిర్మాణం తర్వాతే కీలక వైద్యసేవలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రూ.550 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న మచిలీపట్నంలోని మెడికల్‌ కళాశాలకు వెళ్లేందుకు రైల్వేట్రాక్‌ అడ్డుగా మారింది. ఈ కళాశాలకు వెళ్లాలంటే రైల్వేట్రాక్‌ దాటాలి. మరో మార్గం లేదు. ఈ ట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మిస్తేనే మెడికల్‌ కళాశాలలో అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రధాన అవరోధం

కళాశాలకు 700 మీటర్ల దూరంలోనే రైల్వేట్రాక్‌ ఉంది. మచిలీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్ల రాకపోకల సమయంలో ఇక్కడి గేటు పడుతుంది. 2023, మే 22న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌.. ట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫ్లైఓవర్‌ నిర్మించాలంటే రైల్వేశాఖ నుంచి అనుమతులు పొందాలి. వారి పర్యవేక్షణలోనే ఫ్లైఓవర్‌ నిర్మించాలని మెడికల్‌ కళాశాల అధికారులు చెబుతున్నారు. అయితే, ఇంతవరకు రైల్వేశాఖ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలన చేసింది లేదు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించిన అంశం ఇటీవల మరుగునపడిందని అధికారులే చెబుతున్నారు.

వైద్యసేవలు ప్రారంభమయ్యేనా..?

ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలో 300 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్నారు. దీంతో మెడికల్‌ కళాశాలలో వైద్యసేవలను కూడా ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం దూరంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిని మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆసుపత్రిగా నడుపుతున్నారు. గుండె, ఇతరత్రా మెరుగైన వైద్యసేవలు ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదు. మెడికల్‌ కళాశాలలో ఈ తరహా వైద్యసేవలు ప్రారంభిస్తే అత్యవసర వైద్యసేవలు పొందేవారు తప్పనిసరిగా వస్తుంటారు. అత్యవసర సమయంలో రైల్వేలైన్‌ వద్ద గేటు పడితే రోగుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగే వరకు ప్రసూతి, గుండెజబ్బులు, ఇతర అత్యవసర వైద్యసేవలు మెడికల్‌ కళాశాలలో ప్రారంభించే అవకాశం లేదని మెడికల్‌ కళాశాల, వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

తాగునీరు ఎప్పటికో..

మెడికల్‌ కళాశాలలో తాగునీటి వసతి లేదు. మంచినీటి సరఫరాకు సంబంధించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు, సంప్‌, పైపులైన్‌ నిర్మాణం పనులు చేసేందుకు రూ.8.40 కోట్లతో గతంలో అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలు ఎక్కడున్నాయో తెలియదు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలనే అంశానికి గత ఏడాది మునిసిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లుగా చెబుతున్నా, అవి ఏ మూలకూ సరిపోవట్లేదు. కళాశాలలో వైద్యసేవలు ప్రారంభమైతే నిత్యం తాగునీరు అందుబాటులో ఉండాలి. దీంతో పాటు ఆసుపత్రిలో అన్ని అవసరాల కోసం నీరు ఉండాలి. తాగునీటి వసతికి సంబంధించిన పనులను ఎప్పటికి ప్రారంభిస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. మెడికల్‌ కళాశాలకు తాగునీటి సరఫరా కోసం రైల్వేట్రాక్‌ కింద నుంచి పైపులైన్‌ వేయాలి. దీనికి కూడా రైల్వేశాఖ అనుమతి కావాలి.

Updated Date - Jan 11 , 2025 | 12:54 AM