సంక్రాంతికి పెనుగంచిప్రోలులో క్యాసినో
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:42 AM
సంక్రాంతికి నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీగా కోడి పం దేలు, జూదం నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు చేస్తున్న గుడివాడ క్యాసినో కింగ్ అనుచరులు
జూదగాళ్ల కోసం ఇప్పటికే ఏసీ రూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు బుక్..రూ.లక్షల్లో అడ్వాన్సుల చెల్లింపు
(ఆంధ్రజ్యోతి - కంచికచర్ల)
సంక్రాంతికి నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీగా కోడి పం దేలు, జూదం నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో క్యాసినో తరహాలో జూ దం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో నిర్వహించిన క్యాసినో కింగ్ అనుచరులు ముగ్గురు పెనుగంచిప్రోలులో ఏర్పాట్లు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జూదగాళ్లు మూడు రోజులు ఇక్క డే ఉండేందుకు, వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు ముందుగానే ఏసీ రూమ్‌లు, మామిడి తోటల్లోని ఫంక్షన్ హాళ్లను రూ.లక్షలు అడ్వాన్సులుగా ఇచ్చి అద్దెకు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ ఏర్పాట్లపై స్థానిక ఇంటిలిజెన్స్ అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్యాసినో నిర్వహణ కోసం ముఖ్యులైన కొంతమందిని కలిసి నిర్వాహకులు నగదు అందజేస్తున్నారని తెలిసింది. నందిగామ డివిజన్ పరిధిలో అధికార పార్టీ నేతలతో కలిసి కోడి పం దేల నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. చందర్లపాడు, పల్లగిరి, అనాసాగరం, పరిటాల, గండేపల్లి, భీమవరం, గరికపాడు, తొర్లగుంటపాలెం, జగ్గయ్యపేట, బూదవాడ, లింగాల ప్రాంతాల్లో మామిడి తోటలను, ఖాళీగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లను ఖాళీ స్థలాలను బాగుచేస్తున్నారు.
కోడి పందేలు, జూదానికి అనుమతి లేదు
‘నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందేలు, జూదం నిర్వహణకు అనుమతి లేదు. పందేలు, జూదం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని రూరల్ డీసీపీ మహేశ్వరరాజు విలేకరులకు తెలిపారు.
ప్రత్యేక బృందాలు నియమించాం
‘ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను నియమించాం. ఎక్కడికక్కడ ప్రత్యేక బృం దాలు పర్యటిస్తూ, జూదం జరగకుండ చూస్తాయి. మాకు సమాచారం అందిస్తాయి.’ అని నందిగామ ఏసీపీ తిలక్ పేర్కొన్నారు.