Share News

భయపెట్టి భూములు లాగేశారు!

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:49 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. జగన్‌ ముఠా రూ.వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా తమ పేరిట రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నట్టు తాజాగా వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నంలో సబ్‌ రిజిస్ర్టార్‌గా పనిచేసి ఏసీబీకి చిక్కిన లాలా బాలనాగధర్మ సింగ్‌ తాజాగా రాసిన లేఖలో ఈ బాగోతం బయటపడింది.

భయపెట్టి భూములు లాగేశారు!
ఇబ్రహీంపట్నం మాజీ సబ్‌ రిజిస్ర్టార్‌ లాలా బాలనాగధర్మ సింగ్‌

ఎనీవేర్‌ రిజిసే్ట్రషన్ల మాటున

జిల్లాలో జగన్‌ ముఠా దందా

ఆ భూముల విలువ వందల కోట్లలో

సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను ఉద్దేశించి

మాజీ సబ్‌ రిజిసా్ట్రర్‌ సింగ్‌ లేఖ

జగన్‌ పీఏ, వైఎస్‌ సునీల్‌ పేర్ల ప్రస్తావన

గతంలో ఏసీబీకి చిక్కిన సింగ్‌

వివరాలు సేకరిస్తున్న అధికారులు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. జగన్‌ ముఠా రూ.వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా తమ పేరిట రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నట్టు తాజాగా వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నంలో సబ్‌ రిజిస్ర్టార్‌గా పనిచేసి ఏసీబీకి చిక్కిన లాలా బాలనాగధర్మ సింగ్‌ తాజాగా రాసిన లేఖలో ఈ బాగోతం బయటపడింది. ఈ లేఖలో జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌, జగన్‌కు సోదరుడి వరుసయ్యే వైఎస్‌ సునీల్‌ పేర్లను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి సింగ్‌ రాసిన లేఖలో మాజీ సీఎం జగన్‌ సన్నిహితుల పేర్లు ప్రస్తావించడం సంచలనం రేకెత్తిస్తోంది. 2023లో సింగ్‌ ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిసా్ట్రర్‌గా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లు, ఇతర ఆస్తులపై తనిఖీలు చేశారు. ఆ సమయంలో సింగ్‌ తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సింగ్‌ను గత ఏడాది డిసెంబరు 31న పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సమయంలోనే గత ఏడాది జూన్‌లో సింగ్‌ పదవీ విరమణ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సింగ్‌ తాజాగా లేఖ రాశారు.

ఆడిట్‌ రిజిసా్ట్రర్‌ పాత్ర కూడా...

2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌, జగన్‌కు సోదరుడి వరుసయ్యే వైఎస్‌ సునీల్‌రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత, అతని రెండో భార్య రీతూ చౌదరి(వనం దివ్య) తనను సంప్రదించారని సింగ్‌ లేఖలో పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రిలోని వందల కోట్ల విలువైన భూములను వారి పేర్లపై రిజిసే్ట్రషన్‌ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తాను చేయనని చెప్పానని పేర్కొన్నారు. దీంతో వారు తనను బెదిరించడం ప్రారంభించారని, తనపై ఏసీబీ దాడులు చేయిస్తామని, కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్‌ సుధాకర్‌లా చనిపోయేలా చేస్తామని బెదిరించారని వాపోయారు. వారి బెదిరింపులకు భయపడిన తాను కొన్ని వందల కోట్ల విలువైన భూములను వారి పేరిట రిజిసే్ట్రషన్‌ చేశానని తెలిపారు. ఈ బెదిరింపుల్లో తన పైఅధికారి అయిన అప్పటి ఆడిట్‌ రిజిసా్ట్రర్‌ పాత్ర కూడా ఉందని, ఆయన తన నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారని సింగ్‌ ఆరోపించారు. ఇలా తనతో చేయించుకున్న రిజిసే్ట్రషన్లు అన్నీ అమాయకులైన సామాన్య ప్రజలవేనని, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని సింగ్‌ లేఖలో పేర్కొన్నారు. చీమకుర్తి శ్రీకాంత అనే వ్యక్తి తనను ఏసీబీ కేసు నుంచి బయటపడేస్తానని చెప్పి రూ.కోటి తీసుకున్నారని ఆరోపించారు.

అక్రమాలపై విచారణ

ఏసీబీకి పట్టుబడిన సింగ్‌ను అధికారులు విచారిస్తున్నారు. విచారణలో సైతం సింగ్‌ లేఖలో పేర్కొన్న అంశాలనే వివరించినట్లు సమాచారం. సింగ్‌ తెలిపిన వివరాలను అధికారులు రికార్డు చేసి పూర్తి నివేదికను రిజిసే్ట్రషన్ల శాఖ ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. రెండు రోజుల క్రితం వచ్చిన ఈ నివేదిక ఆధారంగా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి సింగ్‌ హయాంలో ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ సదుపాయంతో చేసిన రిజిస్ర్టేషన్ల వివరాలను బయటకు తీస్తున్నారు. సింగ్‌ చెప్పినట్లుగా ఆ రిజిస్ర్టేషన్లలో ఉన్న భూములు ఎవరివి? ఎవరు రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం వాటి రిజిసే్ట్రషన్ల మార్కెట్‌ విలువ సుమారు ఐదు నుంచి ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. రిజిస్ర్టేషన్‌ ఉన్నతాధికారి ఒకరు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కాకినాడ, విశాఖపట్నం, విజయవాడలో బినామీ పేర్లతో జరిగిన రిజిస్ర్టేషన్ల డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ డాక్యుమెంట్లు తమ వద్దకు వచ్చిన తర్వాత బెదిరించి చేశారా లేక న్యాయబద్దంగా కొనుగోలు చేశారా అనేది తేలాల్సి ఉందన్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుస్తుందని స్పష్టం చేశారు. మొత్తం వివరాలపై ఆరా తీస్తున్నామని, అన్యాయంగా రిజిస్ర్టేషన్‌ జరిగినట్లయితే, బాధితులు ఎవరైనా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే ఆ రిజిస్ర్టేషన్‌ రద్దుకు వీలుంటుందని తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 12:49 AM