Share News

కన్నకూతురే కడతేర్చింది

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:14 AM

ఆ తల్లి పాలిట కన్నకూతురే కాలయముడిగా మారింది. తన వివాహేతర సంబంధానికి అభ్యంతరం చెప్పిన తల్లిని ప్రియుడితో కలిసి క్రూరంగా చంపేసింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న మాతృమూర్తిని చూసి కూడా మనసు కరగలేదు. ఎవరో దుండగలు హత్య చేశారని పోలీసులు అనుమానించారు. దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన తర్వాత కుమార్తె కుట్రకోణం బయటపడింది. ఆ వివరాలను ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ గురుప్రకాశ్‌ బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో వెల్లడించారు.

కన్నకూతురే కడతేర్చింది
నిందితురాలు జీవమణి

ప్రియుడితో కలిసి రోకలితో మోది దారుణ హత్య

వివాహేతర సంబంధాన్ని అంగీకరించనందుకే..

ఏడు గంటలు రక్తంలో కొట్టుకున్నాకనికరించని వైనం

కుమార్తె సహా ప్రియుడు అరెస్టు

విజయవాడ/ఇబ్రహీంపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో గుంటక్వారీ ప్రాంతానికి చెందిన యోహాన్‌, ఎస్తేరు అలియాస్‌ చెంచమ్మ భార్యాభర్తలు. యోహాన్‌ పాస్టర్‌గా పనిచేసి చనిపోయాడు. తర్వాత ఆయన భార్య ఎస్తేరు పాస్టర్‌గా మారారు. వారికి ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె జీవమణి కొండపల్లి ఐడీబీ కాలనీలో ఉంటోంది. ఈమెకు బత్తుల ఏసుబాబు అనే వ్యక్తితో వివాహమైంది. వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. కుమార్తె పుట్టగానే జీవమణి.. ఏసుబాబు నుంచి విడిపోయింది. నాలుగేళ్ల క్రితం ఏసుబాబు చనిపోయాడు.

మరో వ్యక్తితో ప్రేమాయణం

ఐడీబీ కాలనీకి చెందిన షేక్‌ నాగుర్‌వలీ.. జీవమణి తండ్రి యోహాన్‌ వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేవాడు. భర్తతో విడిపోయాక నాగుర్‌వలీతో ఆమె పరిచయం పెంచుకుంది. అతడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. దీనికి తల్లి ఎస్తేరు అభ్యంతరం చెప్పింది. అయినా జీవమణిలో మార్పు రాలేదు. జీవమణి కుమార్తె అంటే ఎస్తేరుకు చాలా ఇష్టం. కొద్దిరోజుల క్రితం ఈ అమ్మాయి నాగుర్‌వలీతో మోటారు సైకిల్‌పై వెళ్లడాన్ని ఎస్తేరు చూసింది. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఆరో తేదీన కుమార్తె జీవమణితో గొడవపడింది. నాగుర్‌వలీ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. ఈ పరిణామానికి కోపం పెంచుకున్న జీవమణి, నాగుర్‌వలీ ఆరోజు సాయంత్రం ఎస్తేరు ఇంటికి వచ్చారు. ఇంట్లో చాలాసేపు ఆమెతో గొడవపడ్డారు. నాగుర్‌వలీ ఆమెను సిమెంట్‌ ఇటుకకు వేసి బలంగా కొట్టాడు. తర్వాత జీవమణి రోకలితో తల్లి తలపై మోదింది.

కనికరం లేని కన్నప్రేమ

దాడి తర్వాత ఎస్తేరు చాలాసేపు రక్తపు మడుగులో ఉండిపోయింది. ఆమె కొన ఊపిరితో ఉందన్న విషయాన్ని గుర్తించిన నిందితులిద్దరూ ఇంటి తలుపులు దగ్గరకు వేసి వెళ్లిపోయారు. ఆమె కేకలు వేస్తే చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారన్న అనుమానంతోనే ఇలా చేశారు. ఎస్తేరు రక్తపు మడుగులో ఏడు గంటలపాటు కొట్టుకుని ప్రాణాలు కోల్పోయింది. గంపలగూడెంలో ఉన్న పెద్దకుమార్తె దేవమణి నిత్యం తల్లికి ఫోన్‌ చేస్తుంటుంది. ఏడో తేదీన ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆమె ఇంటికి వచ్చింది. తలుపులు తీసి చూడగా, ఎస్తేరు చనిపోయి కనిపించింది. దీనిపై ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండపల్లిలో జీవమణి, నాగుర్‌వలీని పోలీసులు అరెస్టు చేశారు. జీవమణి ఉపయోగించిన రోకలిని సీజ్‌ చేశారు.

Updated Date - Jan 09 , 2025 | 01:14 AM