రాజ్యాంగంపై చర్చ జరగాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:23 AM
దేశాన్ని మరింత ఆధునిక దేశంగా మార్చేందుకు రాజ్యాంగంపై చర్చ జరగాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గేయానంద్ అన్నారు.
‘భారత రాజ్యాంగం’ పుస్తకావిష్కరణలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గేయానంద్
విజయవాడ కల్చరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): దేశాన్ని మరింత ఆధునిక దేశంగా మార్చేందుకు రాజ్యాంగంపై చర్చ జరగాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గేయానంద్ అన్నారు. పుస్తక మహోత్సవంలో శనివారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రచించిన ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని, రాం ప్రదీప్ రాసిన ‘విస్మృత మహనీయులు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశంలో అన్ని గొంతుకలు వినబడాలని, అన్ని అభిప్రాయాలు వెల్లడించేందుకు, చర్చలు జరిగేందుకు తగిన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆయన ఆకాంక్షించారు. రాజ్యాంగం ప్రజలకే సర్వాధికారాలు ఇచ్చిందని, వారి హక్కులూ, బాధ్యతలు వారికి అర్థమయ్యేందుకు లక్ష్మణరావు రచన ఉపయోగపడుతుందన్నారు. రాజ్యాంగంలో ప్రతిపాదించిన మౌలిక విలువలు, సూత్రాల అమలు అనుమానాస్పదంగా మారిందని రచయిత లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. మరో రచయిత రాం ప్రదీప్ మాట్లాడుతూ చరిత్రలో కీలకపాత్ర పోషించిన మహనీయులు అనేక కారణాల వల్ల మరుగునపడటం విషాదకరమన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వేదాలు నేటికీ చర్చనీయాంశాలే
వేల సంవత్సరాల క్రితం వేదాలు ఏర్పడినప్పటికీ నేటికీ చర్చనీయాంశాలేనని రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అన్నారు. పుస్తక మహోత్సవంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. రుగ్వేద ‘యథార్థ దర్శనం’, ‘వెలుతురు’, ‘స్వప్నసాగరం’ ‘ఈ గులాబీకి ముళ్లు లేవు’ పుస్తకాలను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. వేదాలు అపౌరుషేయాలు కానప్పటికీ వాటిలోని సౌందర్యాన్ని, ప్రకృతికి సంబంధించిన అవగాహననూ కాదనలేమన్నారు. సమాజశాస్త్ర అధ్యయనానికి కావాల్సిన సమాచారమంతా పుష్కలంగా ఉందన్నారు. నేడు పూజిస్తున్న దేవతలెవరూ వేదాల్లో లేరన్నారు. వేదాలు అధ్యయనం చేస్తున్నవారిలో, గౌరవిస్తున్నవారిలో చాలామందికి వాటి అర్థం తెలియదన్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. గుమ్మా సాంబశివరావు ‘వెలుతురు’ పుస్తకాన్ని సమీక్షించారు. కథా సౌందర్యానికి సంబంధించిన నియమాలను వివరిస్తూ, రసరాజుగారి కథాసంపుటిలో ఆ లక్షణాలున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. రచయిత రసరాజు. గుజ్జు చెన్నారెడ్డి, తాటి శ్రీకృష్ణ, విశాలాం ధ్ర మేనేజరు మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.
జీవితానుభవానికి అక్షర రూపం..‘జీవితం- ఒక అవగాహన’
జీవితానుభవాన్ని అక్షరరూపంగా మలిచిన గ్రంథమే జీవితం - ఒక అవగాహన అని పోలవరపు కోటేశ్వరరావు సాహితీ సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. పుస్తకమహోత్సవంలో జమ్ముల చౌదరయ్య రచించిన జీవితం- ఒక అవగాహన పుస్తకావిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు. జీవితాన్ని తనదైన కోణంలో పరిశీలించి, తర్వాత తరాలకు అవగాహన కల్పించడం కోసం జమ్ముల చౌదరయ్య చేసిన కృషిని ప్రశంసించారు. గ్రంథాన్ని డాక్టర్ గుమ్మా సాంబశివరావు సమీక్షించారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు జీవిత అనుభవాన్ని రంగరించి వ్యక్తిత్వ వికాసం మీద పుస్తకం రాశారని, సమాజానికి కావాల్సిన సమాచారాన్ని సంపూర్ణంగా అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజంపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి జమ్ముల చౌదరయ్య అని అంబేడ్కర్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ వెలగా జోషి పేర్కొన్నారు. వీబీఎ్‌ఫఎస్ గౌరవాధ్యకుడు బెల్లపు బాబ్జి, రచయిత జమ్ముల చౌదరయ్య, వీబీఎ్‌ఫఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.