ఆ ముగ్గురే ఆదర్శం
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:47 AM
‘జీవితంలో నేను ముగ్గురిని ఆదర్శంగా తీసుకుంటాను. వారి దూరదృష్టి, ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి నన్ను ఎంతో ఆకర్షిస్తాయి. ఆ ముగ్గురూ.. సింగ్‌పూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మరొకరు మన సీఎం చంద్రబాబు’ అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేశాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవానికి పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులకు భవిష్యత్తు గురించి దిశానిర్దేశం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
లీ క్వాన్ యూ, వాజ్‌పేయి, చంద్రబాబు మార్గంలోనే వెళ్తా
వారిలోని దూరదృష్టి, ప్రజాసేవ అంటే ఇష్టం
ఫిట్‌నెస్ కన్నా సంకల్పం చాలా గొప్పది
విద్యార్థులతో మాటామంతిలో మంత్రి లోకేశ్
పాయకాపురంలోని జూనియర్ కాలేజీలో పర్యటన
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
అజితసింగ్‌నగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : ‘నడవడానికి ఫిట్‌నెస్ కంటే సంకల్పం కావాలి. సంకల్పం అనేది అన్నిటికన్నా గొప్పది.’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నగరంలోని పాయకాపురంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘మేము ఒకటి, రెండు రోజులు ఆటలు ఆడితే తీవ్రమైన అలసటకు గురవుతున్నాం. మీరు అన్ని రోజుల పాటు అన్ని వేల కిలోమీటర్లు యువగళం పాదయాత్రలో ఎలా నడవగలిగారు.’ అని ప్రశ్నించగా లోకేశ్ పైవిధంగా సమాధానమిచ్చారు.
విద్యావ్యవస్థలో మార్పులు : మంత్రి సత్యకుమార్ యాదవ్
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యపై కొందరిలో చిన్నచూపు ఉందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువు అబ్బదనే అపనమ్మకం ఉందని, విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు లోకేశ్ అద్భుతంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 34 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై కూడా ఆయన దృష్టి పెట్టారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలతో పాటు వారికి ఆరోగ్యవంతమైన భోజనం అందించి, తద్వారా చక్కటి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా సీఎం : ఎంపీ కేశినేని చిన్ని
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో చాలావరకు పేద, బడుగు, బలహీన వర్గాలవారు ఉన్నారని, అటువంటి విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతులమీదుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని, ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం అభినందనీయమన్నారు.
విద్యావ్యవస్థకు స్వర్ణయుగం : ఎమ్మెల్యే బొండా ఉమా
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో విద్యావ్యవస్థకు ఓ స్వర్ణయుగమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోందని, తల్లిదండ్రుల కలలు, ఉపాధ్యాయుల కష్టానికి తగ్గట్టుగా విద్యార్థులు ఉత్తీర్ణులై ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్ చేతులమీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభంకావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా అజితసింగ్‌నగర్‌లో రెండో ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రస్తావనను బొండా ఉమా.. మంత్రి లోకేశ్ ముందుంచారు. ఇందుకు లోకేశ్ స్పందింస్తూ.. ఇది సమయం కాదని, మరోసారి ఈ విషయంపై చర్చిద్దామని చెప్పారు.
బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు
విద్యార్థులతో మాటామంతిలో లోకేశ్‌ను ప్రశ్నించిన విద్యార్థి
జక్రిరెడ్డి (సీఈసీ మొదటి సంవత్సరం) : రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం వేరే రాషా్ట్రలకు, దేశాలకు వెళ్లాల్సి వస్తోందని, ఈ బ్రెయిన్ డ్రెయిన్‌ను నివారించడానికి మన రాష్ట్రంలోనే ఉద్యోగాల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
లోకేశ్ : 1994లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం. కొత్త రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాషా్ట్రనికి అన్ని కంపెనీలు తీసుకొచ్చి యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. 2014-19 మధ్యలో కియాను అనంతపురం తీసుకొచ్చాం. కియా వల్ల అనంతపురం తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే మూడో స్థానానికి చేరింది. చిత్తూరులో ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలు తెచ్చాం. ప్రస్తుతం ప్రకాశంలో బయోఫ్యూయల్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ముందుకొచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, డిఫెన్స్, పెట్రో కెమికల్స్, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా, ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
వైష్ణవి (సీఈసీ రెండో సంవత్సరం) : చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడిగా నియమించారు. యువతకు ఆయన ఎలాంటి విలువలు నేర్పుతారు.
లోకేశ్ : చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ వరకు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేస్తారు.
మయూరి (ఎంపీసీ రెండో సంవత్సరం) : ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేట్‌కు ధీటుగా ఉంచటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
లోకేశ్ : ప్రధానంగా సబ్జెక్టులవారీగా మెటీరియల్, గైడ్స్, క్వశ్చన్ బ్యాంకులు.. తదితరాలు అందించి ఇంటి వద్ద కూడా చదువుకునేలా ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చి, మంచి మెటీరియల్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మౌలిక వసతులు, మెరుగైన విద్యాబోధన వంటి వాటిపైనా దృష్టి పెడుతున్నాం.