Share News

సంక్రాంతి సందడి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:57 AM

నగరం సంక్రాంతి పండుగ కళను సంతరించుకుంది. ఓవైపు ప్రయాణాలతో బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోగా, మరోవైపు షాపింగ్‌లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లు, స్వీట్ల దుకాణాలు.. కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. రోడ్లు గజి‘బిజీ’గా మారిపోయాయి.

సంక్రాంతి సందడి
బీసెంట్‌ రోడ్డులో రద్దీ

రెండు రోజుల ముందే నగరానికి పండుగ కళ

దూరప్రాంతాల నుంచి వచ్చీపోయే వారితో సందడే సందడి

హైదరాబాద్‌-విజయవాడ-విశాఖ మధ్య భారీ రాకపోకలు

విజయవాడలో దిగి పనిలో పనిగా షాపింగ్‌లు

వస్త్ర, స్వీట్ల దుకాణాలు, మొబైల్‌ షోరూమ్‌లు కిటకిట

నగర రహదారుల్లో ట్రాఫిక్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెండు రోజుల ముందే నగ రానికి పండుగ శోభ వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో దూరప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడకు వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. హైదరాబాద్‌ నుంచే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సులన్నీ రద్దీగా వస్తున్నాయి. దీంతో పీఎన్‌బీఎస్‌ కిటకిటలాడుతోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య ఎంత ఉందో, విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా అదే రద్దీ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్నం ప్లాట్‌ఫాం కిటకిటలాడుతున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి, కాకినాడకు రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రైళ్లన్నీ కళకళ

రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి స్పెషల్‌ రైళ్లన్నీ రద్దీగా నడుస్తున్నాయి. పండుగ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు 58 స్పెషల్స్‌ నడుపుతున్నారు. దీంతో సాధారణ రైళ్లతో పాటు స్పెషల్స్‌ కూడా రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు భారీగా సాగుతున్నాయి.

నగరం కిటకిట

విజయవాడ నగర రహదారులు కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజులుగా షాపింగ్‌లతో బీసెంట్‌ రోడ్డు, లెనిన్‌ సెంటర్‌, బందరు రోడ్డులోని షోరూమ్‌లు, మల్లీప్లెక్స్‌ మాల్స్‌లోని బట్టల దుకాణాలు రద్దీగా మారాయి. బందరు రోడ్డులోని షోరూమ్‌లకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొబైల్‌ దుకాణాలతో పాటు రెస్టారెంట్లు, హోటళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.

Updated Date - Jan 11 , 2025 | 12:57 AM