శరవేగంగా..
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:10 AM
కృష్ణాజిల్లా అభివృద్ధి రైలు పట్టాలెక్కింది. విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం, భీమవరం-నరసాపురం, నరసాపురం-నిడదవోలు మార్గంలో డబుల్ రైల్‌లైన్ అందుబాటులోకి వచ్చింది. విద్యుదీకరణ పనులు కూడా పూర్తికావడంతో బుధవారం విశాఖపట్నం పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ సరికొత్త లైన్ అందుబాటులోకి రావడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణాజిల్లాల్లో అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ పరిశ్రమకు మంచిరోజులు వచ్చినట్టైంది.
విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం డబ్లింగ్ పూర్తి
భీమవరం-నరసాపురం-నిడదవోలు మార్గం కూడా..
కృష్ణాజిల్లా ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనున్న మార్గం
221 కిలోమీటర్లు.. రూ.3 వేల కోట్లతో డబ్లింగ్, విద్యుదీకరణ
2019లో పట్టాలెక్కిన పనులు.. వేగంగా అందుబాటులోకి..
విశాఖలో ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య రైలు ప్రయాణం చాలా భారంగా సాగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ఈ మార్గంలో ప్రయాణం వేగవంతంగా సాగేందుకు అన్ని మార్గాలు తెరుచుకున్నాయి. విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం, భీమవరం-నరసాపురం, నరసాపురం-నిడదవోలు మార్గంలో రైల్వేలైన్‌ను డబుల్ లైనుగా మార్చారు. డబ్లింగ్ పనులతో పాటు విద్యుదీకరణ కూడా పూర్తి చేయడంతో ఈ మార్గంలో ప్రయాణం వేగంగా సాగనుంది. ఈ రైలు మార్గాన్ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
దక్షిణ మధ్య రైల్వేలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి 2019లో పట్టాలెక్కించారు. సుమారు 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సుమారు రూ.3 వేల కోట్లను ఖర్చు చేసింది. విజయవాడ, ఉప్పులూరు, ఇందుపల్లి, గుడివాడ, మోటూరు, పెడన, కౌతవరం, మచిలీపట్నం వరకు డబ్లింగ్, విద్యుదీకరణ చేశారు. ఉప్పులూరు-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం నడుమ 69 కిలోమీటర్ల పనులను ఒకే విడతలో పూర్తిచేయడం రైల్వే చరిత్రలోనే అరుదు. ఈ 69 కిలోమీటర్ల డబుల్ లైన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. 25 టన్నుల యాక్సల్ లోడ్‌ను తట్టుకునేలా ఈ లైన్‌ను నిర్మించారు. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చు. 60 కేజీల ప్రీ సె్ట్రస్‌డ్ సిమెంట్ స్లీపర్స్‌ను దీని నిర్మాణంలో ఉపయోగించారు. 11 మేజర్ వంతెనలు, 22 మైనర్ వంతెనలు నిర్మించారు. ఈ మార్గంలోని 24 రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్లను విద్యుదీకరించారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి గోదావరి, కృష్ణాజిల్లాల్లో అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ పరిశ్రమ ఊపందుకుంటుంది. అలాగే, విజయవాడ-విశాఖపట్నం రైలు మార్గంలో ప్రకృతి విపత్తుల కారణంగా ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఈ మార్గం ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.