ముగ్గురికి ప్రాణం పోసిన రైతు
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:31 AM
బ్రెయిన్ డెడ్‌కు గురైన రైతు ముగ్గురికి ప్రాణం పోశారు. ఆయన లివర్, రెండు కిడ్నీలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
లివర్, రెండు కిడ్నీలు దానం చేసిన కుటుంబ సభ్యులు
కర్నూలు హాస్పిటల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): బ్రెయిన్ డెడ్‌కు గురైన రైతు ముగ్గురికి ప్రాణం పోశారు. ఆయన లివర్, రెండు కిడ్నీలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వివరాలివీ.. కర్నూలు జిల్లా కల్లూరు మం డలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన రైతు పెద్దయ్య (59)కు ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఉన్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దీంతో ఆయనను కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించి రెండు రోజులుగా వైద్యం అందించారు. అయితే శనివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానంపై ఏపీ జీవన్‌ధాన్ సమన్వయకర్త డా.రాంబాబు బృందం రైతు కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించారు. దీంతో పెద్దయ్య భార్య, కుమారుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. ఒక కిడ్నీని కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు, లివర్‌ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌కు ఇచ్చారు. ఏపీ జీవన్‌ధాన్ కోఆర్డినేటర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్ ద్వారా అవయవాలను తరలించారు.