ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:28 AM
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. కర్నూలు నగరంలో చిన్నపార్కు సమీపంలోని సీఎస్‌ఐ చర్చి ఇందుకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, చర్చి పెద్దల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది.
కర్నూలు చర్చిలో తల్లిదండ్రుల సమక్షంలో వివాహం
కర్నూలు కల్చరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. కర్నూలు నగరంలో చిన్నపార్కు సమీపంలోని సీఎస్‌ఐ చర్చి ఇందుకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, చర్చి పెద్దల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. కర్నూలుకు చెందిన కొరకోల కీర్తికుమార్ ముంబై ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి ఉద్యోగ రీత్యా జపాన్‌కు వెళ్లారు. అక్కడ టోక్యో సిటీలో ఉద్యోగం చేస్తుండగా, ఆయన టీమ్‌లో ఒకరుగా పనిచేస్తున్న మట్ సుమోటొ రింకతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
వివాహానికి నాలుగేళ్లుగా అవగాహన
తమ వివాహానికి సరైన అవగాహన, పెద్దల సమ్మతికి నాలుగేళ్ల సమయం పట్టిందని కొరకోల కీర్తికుమార్ చెప్పారు. ముందుగా ధైర్యం చేసి రింక తన తల్లిదండ్రులు మట్ సుమోటొ రియోకో, మట్ సుమటో తఢాకకు ప్రేమ విషయం తెలియజేశారు. వారు ఆమెతో ఇండియా వెళ్లి అక్కడ నీవు ఉండగలవో లేదో చూసి రమ్మని చెప్పారు. అలా ఆమె ఇండియాకు వచ్చి, కొంతకాలం ఉండి తర్వాత తల్లిదండ్రులకు తన ఇష్టాన్ని తెలియజేసింది. కీర్తికుమార్ తల్లిదండ్రులు కొరకోల ప్రేమమ్మ, కొరకోల ప్రేమ్‌కుమార్ కూడా వారి ప్రేమకు పచ్చజెండా ఊపారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలో, సీఎస్‌ఐచర్చిలో, చర్చి పాస్టర్లు సంప్రదాయబద్ధంగా కీర్తికుమార్, రింకల వివాహం జరిపించారు.