ఆక్రమణలో అవుకు రిజర్వాయర్
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:28 PM
అవుకు రిజర్వాయర్ భారీగా ఆక్రమణకు గురవుతున్నా ఎస్సార్బీసీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేల మెట్రిక్ టన్నుల వేస్టేజీని రిజర్వాయర్‌లో తోస్తున్న వ్యాపారులు
తగ్గుతున్న నీటి నిల్వ శాతం
కలుషితమవుతున్న నీరు
పట్టించుకోని అధికారులు
అవుకు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : అవుకు రిజర్వాయర్ భారీగా ఆక్రమణకు గురవుతున్నా ఎస్సార్బీసీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలేరు చెరువు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులను కలుపుతూ 4.148 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మితమైంది. నంద్యాల, కడప జిల్లాల్లోని 42,509 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు రిజర్వాయర్ నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 36.50 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాటర్ సప్లయ్ (సీపీడబ్ల్యూఎస్) స్కీంను నిర్మించారు. ఈ పథకం ద్వారా అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని 50 గ్రామాలకు ప్రతి రోజు 40 లక్షల లీటర్లు (4ఎంఎల్‌డీ) తాగునీరు అందుతోంది. అలాగే కొలిమిగుండ్ల మండలంలో నిర్మించిన రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి రెండు సంవత్సరాల క్రితం నుంచి ప్రతిరోజు 25 లక్షల లీటర్ల (2.5ఎంఎల్‌డీ) నీటిని రిజర్వాయర్ నుంచి తరలిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న అవుకు రిజర్వాయర్ పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకొనే అధికారులు కరువయ్యారు.
రిజర్వాయర్‌ను ఆక్రమించి నాపరాతి డిపోల ఏర్పాటు
రిజర్వాయర్ పక్కనే తాడిపత్రికి వెళ్లే నేషనల్ హైవే (ఎన్‌హెచ్ 544డి) ప్రధాన రహదారి ఉంది. వాహనదారుల రక్షణ కోసం రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) స్థాయి నుంచి 150 నుంచి 200 మీటర్లు స్థలాన్ని వదిలి ఎన్‌హెచ్ రహదారిని నిర్మించారు. రిజర్వాయర్ వెంట వదలిన స్థలం నాపరాతి డిపోల వ్యాపారులకు వరంగా మారింది. రిజర్వాయర్ సమీపంలోని చెర్లోపల్లె, రామాపురం గ్రామాల పరిధిలో విస్తారంగా మైనింగ్ (నాపరాతి గనులు) విస్తరించి ఉన్నాయి. గనుల్లోని నాపరాతిని ట్రాక్టర్ల ద్వారా రిజర్వాయర్ ఆక్రమిత స్థలం వద్దకు తీసుకవచ్చి 1 కి.మీ పొడవున నాపరాతి డిపోలను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు.
తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం
నాపరాతి డిపోల నుంచి వచ్చే వేస్టేజీతో పాటు నాపరాయి పాలిష్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను రిజర్వాయర్‌లో భారీ ఎత్తున డంప్ చేస్తుండటంతో రిజర్వాయర్‌లో పూడిక చేరి నీటినిల్వ శాతం తగ్గిపోతుంది. రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు అందించే తాగునీరు కలుషితమవుతోంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. ఎస్సార్బీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించి రిజర్వాయర్ ఆక్రమణను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నాపరాతి వ్యర్థాలను రిజర్వాయర్‌లోకి తోస్తున్న వ్యాపారులు
వ్యాపారులు నాపరాతి డిపోల వద్ద నిల్వ ఉంచిన రాళ్లను కార్మికులతో వివిధ ఆకృతుల్లో కటింగ్ చేయిస్తున్నారు. ఆ నాపరాళ్లను చెక్కపెట్టెల్లో చేర్చి ప్యాకింగ్ చేసి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలకు సరఫరా చేస్తూ వ్యాపారులు రూ. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. నాపరాతి కటింగ్ నుంచి వచ్చే వేల మెట్రిక్ టన్నుల వేస్టేజీని మాత్రం ఎక్స్‌కవేటర్లతో రిజర్వాయర్‌లోకి తోసేస్తున్నారు. అంతేగాక నాపరాళ్ల పరిశ్రమల నుంచి వచ్చే వేస్టేజీని కూడ రిజర్వాయర్‌లో వదులుతున్నారు.
నాపరాతి వేస్టేజీతో తగ్గనున్న నీటినిల్వ
నాపరాతి డిపోలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నాపరాతి కటింగ్ నుంచి వచ్చే వేస్టేజీని రిజర్వాయర్‌లో వేస్తున్నారు. దీంతో రిజర్వాయర్‌లో నీటినిల్వ శాతం తగ్గిపోతున్నది. నాపరాతి ఫ్యాకరీల నుంచి వచ్చే వ్యర్థాలను రిజర్వాయర్‌లో వేస్తుండటంతో తాగునీరు కలుషితమవుతున్నది.
- వెంకట రమణనాయక్, అవుకు
రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేశారు
రిజర్వాయర్ నిర్వహణను ఎస్సార్బీసీ అధికారులు గాలికి వదిలేశారు. వ్యాపారులు రిజర్వాయర్ స్థలాన్ని ఆక్రమించుకోవటమే కాక నాపరాతి కటింగ్ నుంచి వచ్చే వేస్టేజీని రిజర్వాయర్‌లో వేయటం వ్యాపారులకు తగదు. నాపరాతి డిపోల వ్యాపారులను ఖాళీ చేయించాలి.
- మారం పుల్లారెడ్డి, రామాపురం గ్రామం.
నాపరాతి డిపో వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం
రిజర్వాయర్ స్థలాన్ని ఆక్రమించి నాపరాతి డిపోలను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులపై త్వరలో చర్యలు చేపడతాం. ఎస్సార్బీసీ డీఈలు, ఏఈలకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులకు ఫిర్యాదు చేసి నాపరాతి డిపోలను ఖాళీ చేయిస్తాం.
- సురేష్‌బాబు, ఎస్సార్బీసీ ఈఈ, అవుకు