Share News

క్రైం తగ్గింది

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:12 AM

నంద్యాల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 2024లో నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా అన్నారు.

క్రైం తగ్గింది
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

నంద్యాల క్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 2024లో నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్‌ సమావేశ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన 2024లో జరిగిన నేరాల వివరాలను వెల్లడించారు. పోలీసు సిబ్బంది సమష్టిగా పనిచేసి 2023 కన్నా 2024లో నేరాలను 14.3శాతం తగ్గించారని అన్నారు. పోలీసు వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజారక్షణలో మరింత పకడ్బందీగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నదని అన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచేలా, ప్రత్యేక కార్యాచరణ చేపట్టి జిల్లావ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అమలు చేశామని తెలిపారు. 2024లో మర్డర్లు, సైబర్‌ నేరాల కేసులు పెరిగాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రోడ్డుప్రమాదాల కేసులు స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. 2024లో 45హత్యలు జరగ్గా అందులో 31హత్యలు వివాహేతర సంబంధాలకు చెందినవేనని, మిగతావి కుటుంబ తగాదాలతో సంభవించినవేనన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌వల్ల ఈ ఏడాది నేరాల సంఖ్య 26శాతం తగ్గిందన్నారు. రాబరి కేసుల్లో 5 కేసులు ఛేదించి వందశాతం రికవరీ రేటు సాధించారన్నారు. 8.7.2024న బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయిలకు స్పెషల్‌ ఫోక్సో కర్నూలు కోర్టు 5సంవత్సరాల కారాగార జైలు, లక్ష రూపాయల జరిమానా విధించిందన్నారు. జిల్లావ్యాప్తంగా నమోదైన మొబైల్‌ మిస్సింగ్‌, చోరీ కేసుల్లో సుమారు రూ.2.43కోట్ల విలువైన 1066మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశామన్నారు. జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది సమష్టిగా ఇదే స్ఫూర్తితో పనిచేసి 2025లో కూడా నేరాలను అదుపు చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:12 AM