సమగ్ర వివరాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:22 AM
షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాలపై ఆయా శాఖల వారిగా సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
అధికారులు, ప్రజా సంఘాలతో సమీక్ష
కర్నూలు కలెక్టరేట్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాలపై ఆయా శాఖల వారిగా సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబం ధించి ఏకసభ్య కమిషన్ సభ్యులు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ అంశంపై ప్రజా సంఘాలు, వివిధ సంస్థల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ సభ్యు డు రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు 1, 2024న వెలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పూర్వ జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ అంశంపై వ్యక్తులు, సంస్థల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఉప కులాల వారిగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా సమగ్రమైన వివరాలను సేకరించి వాటి ఆధారంగా ఏకసభ్య కమిషన్ సిఫారసులను అందిస్తుందని అన్నారు. ఉప కులాల వారిగా విద్య, ఉపాధి రంగాల్లో ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికి ఒక నమూనా ఇచ్చామని అన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు ఎన్ని ఉన్నదీ ఉప కులాల వారిగా వివరాలు ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు. అలాగే అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారి వివరాలను కూడా సమగ్రంగా ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాల వారిగా పూర్తి స్థాయిలో సమగ్రంగా వివరాలను పంపాలని అధికారులను ఆదేశించారు.
వినతుల స్వీకరణ: అనంతరం షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వర్గీకరణకు సంబంధించి వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతులను ఏకసభ్య కమిషన్ స్వీకరించింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తులసిదేవి తదితరులు పాల్గొన్నారు.