వైభవంగా వైకుంఠ ఏకాదశి
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:13 AM
వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి
కిటకిటలాడిన వైష్ణవాలయాలు
భక్తులకు ఉత్తర ద్వార దర్శనం
కర్నూలు కల్చరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో శుక్రవారం భక్తులు వేలాదిగా వైష్ణవాలయాలకు తరలివచ్చారు. అలంకార ప్రియుడైన విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవి, గోదాదేవి అమ్మవార్ల మూల మూర్తులను, ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. ఆలయాలకు విభిన్న రంగుల్లోని పుష్పాలతో తోరణాలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి.