Share News

పూర్తయిన గోకులం షెడ్లు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:50 PM

మూగజీవాలకు నీడ కల్పించాలనే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేస్తున్న గోకులం షెడ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయి. రెండు జిల్లాలో 2వేల దాకా గోకులం షెడ్లు మంజూరయ్యాయి.

పూర్తయిన గోకులం షెడ్లు
క్రిష్ణగిరిలో సిద్ధమైన గోకులం షెడ్డు

సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ప్రారంభోత్సవాలు

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మూగజీవాలకు నీడ కల్పించాలనే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేస్తున్న గోకులం షెడ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయి. రెండు జిల్లాలో 2వేల దాకా గోకులం షెడ్లు మంజూరయ్యాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ 90 శాతం సబ్సిడీతో వీటిని మంజూరు చేసి నిధులను ఖర్చు చేస్తుంది. కేవలం 10 శాతం ఖర్చు మాత్రమే రైతు భరించాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం పూర్తయిన గోకులాల షెడ్లను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల చేత 10 నుంచి 12వ తేదీ వరకు ప్రారంభించి రైతుల్లో సంతోషం నింపింది. కర్నూలు జిల్లాలో 320 గోకులం షెడ్లు, నంద్యాల జిల్లాలో 700 గోకులం షెడ్లు పూర్తి కాగా, శనివారం రెండు జిల్లాలో ప్రజాప్రతినిధుల చేత ప్రారంభోత్సవాలు జరిగాయి. ఒక్కో గోకులం షెడ్డుకు రూ.1.15 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాది కర్నూలు జిల్లాలో 1200, నంద్యాల జిల్లాలో 850 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. ఈ షెడ్లను నిర్మించుకునేందుకు రైతుల వద్ద పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటి దాకా పాడి పశువులను ఎక్కడ ఉంచాలో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం జిల్లా నీటి యజమాన్య సంస్థ ఆధ్వర్యంలో 90 శాతం సబ్సిడీని భరించి గోకులాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరుకల్లా గోకులం షెడ్లను పూర్తి చేసి రైతులకు అందిస్తామని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా పశుసంవర్ధ్దక అధికారి మోహన్‌ నాయక్‌ తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 11:50 PM