Share News

ఘనంగా స్వర్ణోత్సవాలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:43 AM

ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 1974లో ఏర్పాటైన ఈ కళాశాల 50 ఏళ్లను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రెండు రోజులపాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజైన శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.

ఘనంగా స్వర్ణోత్సవాలు
అధ్యాపకుడిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థులు

వేలాదిగా తరలివచ్చిన పూర్వ విద్యార్థులు

విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు సత్కారం

ఆత్మకూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 1974లో ఏర్పాటైన ఈ కళాశాల 50 ఏళ్లను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రెండు రోజులపాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజైన శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు అలనాటి మధుర జ్ఞాపకాలతో, తోటి స్నేహితులతో పులకించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చునన్న విషయానికి ప్రస్తుత పూర్వ విద్యార్థులను చూస్తే అర్థమవుతుందన్నారు. అప్పట్లో ఎలాంటి సదుపాయాలు లేనప్పటికీ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదన్నారు. త్వరలోనే ఇంజనీర్‌ కళాశాల కోసం ప్రతిపాదనలు తయారు చేయిస్తానని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్‌ ఆఫీసర్‌ రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాల విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతిఏటా విద్యార్థులకు నగదు పారితోషికాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తనవంతుగా రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జగన్నాథం మాట్లాడుతూ.. తమ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం చూస్తూ గాల్లో తేలిపోయినంత ఆనందం కల్గుతోందని అన్నారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థి, పారిశ్రామికవేత్త ఆవుల నారాయణరెడ్డి కళాశాల అభివృద్ధికి రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అలనాటి అధ్యాపకులను సత్కరించారు. వేడుకకు విచ్చేసిన వారందరికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రెండు రోజుల పాటు భోజన సదుపాయాన్ని కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఘురామాచార్యులు, డీఆర్‌డీఏ శాస్త్రవేత్త వీరబ్రహ్మం, కళాశాల స్థలదాత కుటుంబీలు వెన్నా భోగిరెడ్డి, డాక్టర్లు గోవిందరాజులు, డాక్టర్‌ శంకర శర్మ, డాక్టర్‌ గౌరీనాథ్‌ ఉన్నారు.

ఆనందంగా ఉంది

నేను అధ్యాపకునిగా పని చేసిన కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. విద్యార్థులు ప్రయోజకులుగా మారారు. రాణించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు ఇవ్వడం వారిలో మరింత స్ఫూర్తినింపుతోంది. - కుమార్‌, ఫస్ట్‌ బ్యాచ్‌ బాటనీ అధ్యాపకుడు

ఆనందంగా ఉంది

కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉంది. కుమార్‌ సార్‌ మార్గదర్శకాలే ఉన్నత స్థాయిలో నిలిపాయి. - డాక్టర్‌ శంకర్‌శర్మ, గాస్ర్టో ఎంట్రాలజిస్టు, కర్నూలు

కొందరు లేక బాధ.

మా బ్యాచ్‌లో 148 మంది ఉండగా, కొం దరు స్నేహితులు లేకపోవడం బాధేస్తోంది. ఎస్వీ నారాయణ 2009 లో ఓ సారి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. రూ.4లక్షల వరకు కళాశాల అభివృద్ధికి తోడ్పాటునందించాం. మున్ముందు కూడా సహకరిస్తాం. - ఎస్వీ ప్రసాద్‌, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, నంద్యాల

Updated Date - Jan 05 , 2025 | 12:43 AM