Share News

‘వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వాల జోక్యం తగదు’

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:34 AM

ముస్లిం మైనార్టీకి చెందిన వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వాల జోక్యం తగదని ముస్లిం మత పెద్దలు అన్నారు.

‘వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వాల జోక్యం తగదు’
వెలుగోడులో నిరసన తెలుపుతున్న ముస్లింలు

వెలుగోడు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీకి చెందిన వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వాల జోక్యం తగదని ముస్లిం మత పెద్దలు అన్నారు. సోమవారం వెలుగోడులోని ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కుడి చేతికి ముస్లింలు నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్లకార్డులు చేతపట్టి మౌనంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుద్వార వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకోవాడానికి ప్రయత్నిస్తోందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వక్ఫ్‌ భూములు ప్రభుత్వం ఇచ్చినది కాదని, తాము ఆక్రమించి నవి కావని తరతరాలుగా వస్తున్న వారసత్వ భూములని తెలిపారు.

పాములపాడు: వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం పాములపాడులోని కేజీ రోడ్డుపై ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. మత గురువులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉండాలని, ముఖ్యమంత్రి ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. ముస్లింల పట్ల వివక్ష తగదని నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక మజీదు నుంచి బస్టాండు కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మత గురువులు సుబాన్‌, హారీఫ్‌, మండల మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మౌలా హుసేన్‌, కో ఆప్షన్‌ మోంబర్‌ ముర్తుజావలి తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ముస్లింలు సోమవారం నల్లబ్యాడ్జీలుఽ ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ముస్లిం పెద్దలు ఖాజా, వహీద్‌, బషీర్‌, ఇస్మాయిల్‌, మొల్ల బాషా, మహ్మద్‌ హనీఫ్‌, పెద్ద హుశేన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డులో ముస్లీమేతరులకలు స్థానం కల్పించడం ఒక దుశ్చర్య అన్నారు. ఎవరికి కేటాయించిన సంస్థల్లో వారు ఉంటే ఆ సంస్థలకు దేశానికి కూడా మేలు జరుగుతుందన్నారు. అలాగే పూర్వికులు మసీదులు, ఈద్గాలు, కబ్రస్తాన్‌లు, ఇతర మదరస్సాలు వాటి సౌకర్యాలు అవసరాలు తీర్చుకోవడం కోసం భూములు దానం చేశారని అన్నారు. కార్యక్రమంలో నజీర్‌, షరీఫ్‌, మౌలాలి, సలాం, హన్సీర్‌, చాంద్‌బాషా, ముర్తుజావలి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:34 AM