Share News

ఆశలు.. ఆశయాలు!

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:20 AM

కాలగమనంలో ఓ ఏడాది ముగిసింది.

ఆశలు.. ఆశయాలు!

ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు

సరికొత్త ఆశలకు ఊపిరి పోస్తూ

2025లో ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం

మంత్రి నుంచి సామాన్యుల వరకు మార్పు కోసం శ‘పథం’

కర్నూలు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):

కాలగమనంలో ఓ ఏడాది ముగిసింది. మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుని.. చెడు సంఘటనలు వదిలేస్తూ 2024కు ప్రతి ఒక్కరూ ఘన వీడ్కోలు పలికారు. సరికొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సంబరాలు.. సంతోషాల మేళవింపుతో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు. జిల్లా పాలనా యంత్రాంగం, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, మహిళలు.. ఇలా వివిధ వర్గాల వారిని ఆంధ్రజ్యోతి పలకరించింది. నవ వసంతంలో అడుగులు వేసిన వేళ ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారని పలకరించింది. ఒక్కొక్కరిది ఒక్కో లక్ష్యం. అంతిమంగా ప్రగతి వికాశమే ఆశయంగా సాగుతామని వెల్లడించారు.

ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా

2024లో పుట్టిపెరిగిన నా జిల్లాకు కలెక్టర్‌గా రావడం మరవలేని మధుర జ్ఞాపకం ఇది. 2025లో జిల్లా కలెక్టర్‌గా కరువు నివారణ లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తా. ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌, కర్నూలు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, పారిశ్రామికవాడలో నీటి వసతి కోసం జలాశయం నిర్మాణం, పత్తికొండ టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌ పార్కులకు భూ కేటాయింపులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేయడంతో పాటు జిల్లాలో ప్రగతి వికాసానికి పాడుపడుతా.

- పి. రంజిత్‌బాషా, జిల్లా కలెక్టర్‌, కర్నూలు

ప్రాణం విలువ తెలిసేలా అవగాహన

మానవ తప్పిదాలు, ఆటోల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు సేఫ్టీ ఎంతో ముఖ్యం. టెక్నికల్‌ డ్రైవింగ్‌పై అవగాహన ఉండాలి. చిన్నచిన్న విషయాలకు గొడవలు పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అదే క్రమంలో సెల్‌ఫోన్లలో అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు వినియోగించి యువత పెడదారి పడుతున్నారు. మూడు అంశాలను ప్రత్యేకంగా తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించేలా 2025లో ముందుకు వెళ్తాం. అదే క్రమంలో కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రాణం విలువ ప్రజలకు తెలిసేలా చైతన్యం కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం.

- డాక్టర్‌ కోయ ప్రవీణ్‌,

డీఐజీ, కర్నూలు రేంజ్‌

పారిశ్రామిక ప్రగతే లక్ష్యం

రాజకీయ జీవితంలో 2024 మరువలేనిది. కర్నూలు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాను. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో కీలకమైన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. రాయలసీమ చిరకాల స్వప్నమైన హైకోర్టు బెంచ్‌ కర్నూలులో ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించేలా కీలక బాధ్యతలు పూర్తి చేశా. రూ.14 వేల కోట్ల పెట్టుబడితో సెమికండక్టర్‌ పరిశ్రమలకు ఓర్వకల్లుకు తీసుకొచ్చా. 2025లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, తీసుకొచ్చిన పరిశ్రమలు ప్రారంభించేలా కృషి చేస్తా. జిల్లాను పారిశ్రామిక ప్రగతి వైపు నడిపిస్తా. కర్నూలు నియోజకవర్గంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రోడ్డు ఆధునికీకరణ, పచ్చదనం, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు వెళ్తా. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

- టీజీ భరత్‌, పరిశ్రమల శాఖ మంత్రి

సైబర్‌ క్రైంపై ప్రత్యేక ఫోకస్‌

సైబర్‌ క్రైం నివారణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడతాం. బాధితులకు ఇప్పటికే రూ.50-60 లక్షలు ఇప్పించాం. ఫ్రీజ్‌ చేసిన రూ.1.50 కోట్లు 2025 సంక్రాంతిలోగా ఇప్పించాలన్నదే లక్ష్యం. నేరాల నియంత్రణంలో సాంకేతిక పరిజ్ఞానం జోడించేందుకు జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. 25 డ్రోన్లకు ఎంపీ నిధులు ఇచ్చేందుకు కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరిలు ముందుకు వచ్చారు. వీటితో బాధితులకు న్యాయం చేసే లక్ష్యంతో 2025లో ముందుకు వెళ్తాం. - జి. బిందుమాధవ్‌, ఎస్పీ, కర్నూలు

నిరుద్యోగుల పరిస్థితి మారడం లేదు.

కొత్త సంవత్సరాలు వస్తున్న నిరుద్యోగుల పరిస్థితి మారడంలేదు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేనే 2025 సంవత్సరం సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ, పీజీలు చదివి నిరుద్యోగ యువత ఉద్యోగాల లేకుండా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలేదు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని నిరుద్యోగుల ఆశిస్తుంటారు. ఈ సంవత్సరమైన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగాల భర్తీకి రూపకల్సన చేస్తేనే నిరుద్యోగుల కళ్లలో ఆనందం కనపడుతుంది.

- అబ్దుల్లా, కర్నూలు

చెరువులకు నీరు వదలాలి

వారసత్వంగా వచ్చిన ఎకరన్నర పొలంతోపాటు మరికొంతపొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. 2024 సంవత్సరం మాకు మంచి పంటలను అందించింది. ప్రధానవాణిజ్యపంట వేరుశనగ ఆశించిన స్థాయిలో దిగుబడిని అందించలేకపోయినా టమోటా ధర బాగా పలకడంతో లాభాలు వచ్చాయి. అలాగే పత్తికొండ, రాతన చెరువులకు నీరునింపితే కింద ప్రాంతంలో ఉన్న బోర్లకు నీరుచేరి తోటలసాగుచేసుకోవచ్చు. మూగజీవాలకు తాగేందుకు నీరు దొరుకుతుంది. ఈ ఏడాది మంచే జరుగుతుందన్న నమ్మకం ఉంది. - రామాంజనేయులు, రైతు, పత్తికొండ

కొత్త ఏడాదిలో ఆటో కొనాలి

కొత్త సంవత్సరంలో కొత్త ఆటో కొనుగోలు చేయాలి. 2024 సంవత్సరంలో అంతంత మాత్రంగానే ఉండేది. ఆటో నడుపుకుంటూ కుటుంబ పోషణ వరకే డబ్బు సరిపోయేది. ఈ ఏడాదిలోనైనా ఆటోకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, రిపేరులు రాకుండా ఉండి మంచిగా జరగాలి. కొత్త ఆటో కొనుక్కోవాలన్నదే చిరకాల ఆశ.

- వీరేష్‌, ఆటో డ్రైవర్‌, ఆదోని

Updated Date - Jan 01 , 2025 | 12:21 AM