Share News

ఉపాధి పనుల్లో అక్రమాలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:11 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అవకతవకలు, సిబ్బంది రికార్డుల నిర్వహణ లోపం సామాజిక తనిఖీ వేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ఉపాధి పనుల్లో అక్రమాలు
సామాజిక తనిఖీ ప్రజా వేదికలో వివరాలను తెలుపుతున్న సిబ్బంది

సామాజిక తనిఖీ ప్రజా వేదికలో బట్టబయలు

రూ.6,08,203 రికవరీకి, 8,27,592 మొక్కల రీ ప్లాంటేషన్‌కు ఆదేశాలు

గడివేముల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అవకతవకలు, సిబ్బంది రికార్డుల నిర్వహణ లోపం సామాజిక తనిఖీ వేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఎస్‌ఆర్‌పీ కాశయ్య ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బృందం 2023-24లో జాతీయ ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్‌ శాఖలో జరిగిన 1,011 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తనిఖీ చేశారు. ఉపాధిహామీ పనుల్లో జరిగిన అక్రమాలను సామాజిక తనిఖీ బృందం సభ్యులు అధికారులకు చదివి వినిపించారు. ఉపాధి హామీ కూలీల కన్నా వలంటీర్లకు వారం రోజులు మస్టర్‌లో హాజరు వేసినట్లు తనిఖీ బృందం గుర్తించింది. మినీ గోకులాల్లో అధిక ధరలకు రికార్డులు సృష్టించి నగదు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు మస్టర్‌ నిర్వహణ సక్రమంగా నిర్వహించలేదని అన్నారు. కూలీల సంతకాలు లేకుండానే నగదు ఇచ్చారని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. తిరుపాడు గ్రామంలో పని చేయని కూలీలకు పని చేసినట్లు హాజరు వేసి వేతనాలు ఇచ్చినట్లు గుర్తించారు. పంట కాలువ కొలతల్లో భారీగా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. కరిమద్దెల గ్రామంలో చేసిన పనులకు ఇతర గ్రామాల రికార్డులను జత చేసి బిల్లులు స్వాహా చేసినట్లు గుర్తించారు. హార్టికల్చర్‌లో వేసిన మొక్కలు పర్యవేక్షణ లోపం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అవకతవకల వివరాలను జిల్లా విజిలెన్స్‌ అధికారి అన్వారాబేగం వద్ద వివరించారు. నివేదికలు పరిశీలించిన అనంతరం రూ.6,08,203 ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేయాలని, 8,27,592 మొక్కలను రీప్లాంటేషన్‌ చేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో భాస్కర్‌నాయుడు, ఏపీడీ బాలాజీనాయక్‌, శిభారాణి, అంబుడ్స్‌ పర్సన్‌ సురేంద్రకుమార్‌, జేక్యూసీ గంగాధర్‌, ఎంపీడీవో వాసుదేవ గుప్తా, ఏపీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:11 AM