Share News

అద్భుత నగరంగా కర్నూలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:52 PM

‘నగరాలు అభివృద్ధి చెందాలంటే ఎనర్జీ (పవర్‌) ఎంతో ముఖ్యం. రాష్ట్రానికి అసరమైన విద్యుత్‌లో సగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది.

అద్భుత నగరంగా కర్నూలు

రాష్ట్రానికి అవసరమైన సగం విద్యుత్‌ ఇక్కడే ఉత్పత్తి

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

గ్రీన్‌కో కంపెనీ నిర్మించిన ఐఆర్‌ఈపీ ప్రాజెక్టు పరిశీలన

కర్నూలు/ఓర్వకల్లు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘నగరాలు అభివృద్ధి చెందాలంటే ఎనర్జీ (పవర్‌) ఎంతో ముఖ్యం. రాష్ట్రానికి అసరమైన విద్యుత్‌లో సగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా కర్నూలు అభివృద్ధి చెందుతుంది’ అని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటంతండా, నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్‌కో గ్రూప్‌ 2,800 ఎకరాల్లో 5, 5,230 మెగావాట్ల యూనిట్లు విద్యుత్‌ సామర్థ్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట గ్రీన్‌కో గ్రూప్‌ సీఈఓ, ఎండీ చలమలశెట్టి అనిల్‌, కర్నూలు కలెక్టరు పి. రంజిత్‌బాషా ఉన్నారు. ఐఆర్‌ఈపీలో భాగంగా నిర్మించిన అప్పర్‌ ఇన్‌టెక్‌ పాయింట్‌, లోయర్‌ ఇన్‌టెక్‌ పాయింట్‌ సహా పవర్‌ హౌస్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. విద్యుత్‌ ఉత్పత్తిపై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కారు నడుపుతూ టన్నెల్‌ పరిశీలించారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల కలెక్టర్లు పి. రంజిత్‌బాషా, రాజకుమారి, గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో, ఎండీ చలమలశెట్టి అనిల్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దూరదృష్టికి పిన్నాపురం ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రత్నాలు సీమగా మార్చాలనే సంకల్పంతో ఆసియాలోనే తొలి వెయ్యి మెగావాట్లా సోలార్‌ ప్లాంట్‌ ఇక్కడే నిర్మించారు. సేద్యానికి పనికిరాని రాళ్ల భూమిలో ఒకే ప్రాంతంలో సోలార్‌, విండ్‌, హైడ్రో పవర్‌ జనరేషన్‌ చేసేలా ఐఆర్‌ఈపీ నిర్మాణానికి ఆనాడే శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో విదేశాలకు విద్యుత్‌ అమ్ముకునే స్థాయికి ఎదుగుతామన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్‌లో సైట్‌ సీయింగ్‌ పర్యాటక క్షేత్రంగా, ఎడ్యుకేషనల్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందని వివరించారు. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూలు చేస్తే ఇలాంటి అద్భుత విషయాలు తెలియవన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు జిల్లా కలెక్టరు పి.రంజిత్‌బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎస్పీ బిందుమాధవ్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టరు విద్యాసాగర్‌, డీఎస్పీ వెంకట రామయ్య తదితరులు ఘనస్వాగం కలికారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక వినామంలో ఓర్వకల్లు నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. నంద్యాల ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జనసైనికుల్లో నిరుత్సాహం

ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన ముఖ్య నాయకుల్లో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటన నిరుత్సాహం నింపింది. షెడ్యూల్‌ ప్రకారం అర గంట పాటు జనసేన నాయకులతో పవన్‌కళ్యాణ్‌ సమీక్షిం చాల్సి ఉంది. పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి చింతా సురేశ్‌, ఆదోని, ఎమ్మిగనూరు, మల్లప్ప, రేఖాగౌడ్‌, తెర్నేకల్లు యంక ప్పతో పాటు కర్నూలు, శ్రీశైలం, డోన్‌, పత్తికొండ, నందికొట్కూరు, ఆత్మకూ రు, కోడుమూరు నియోజకవర్గాల బాధ్యులు అర్షద్‌, అశోక్‌, బ్రహ్మ, రాజశేఖర్‌, మల్లయ్య, నల్లమల రవి, రాంబాబు, సురేశ్‌, ఏపీ వాల్మీకి/ బోయ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంజూనాథ్‌లు గ్రీన్‌కో కంపెనీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు. జనసేన నాయకులతో బ్లాక్‌-8లో సమావేశం ఏర్పాటు చేశారు. వారితో అరగంట సమావేశమై పార్టీ బలోపేతం, నామినే టెడ్‌ పోస్టులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. పర్యటన ఆలస్యం కావ డంతో సమావేశం నిర్వహించకుండానే పవన్‌ కళ్యాణ్‌ వెళ్లిపోయారు. దీంతో జనసేన నాయకులు కొంత నిరుత్సాహం చెందారు. తమవద్దకే వచ్చిన అధినేతను కలుసుకోలేకపోయామని ఓ నాయకుడు పేర్కొనడం కొసమెరుపు.

Updated Date - Jan 11 , 2025 | 11:53 PM