రామ్‌కో చుట్టూ ఉన్న భూములను కొనాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:26 PM
రామ్‌కో సిమెంట్ పరిశ్రమ చుట్టూ మిగిలిన భూములన్నీ కంపెనీ కొనాలని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పరిసర గ్రామాల రైతులు డిమాండ్ చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల డిమాండ్
ఫిర్యాదులన్నీ నమోదు చేశామన్న జేసీ విష్ణుచరణ్
రామ్‌కో ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఓకే చెప్పిన మెజారిటీ వర్గం
కొలిమిగుండ్ల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : రామ్‌కో సిమెంట్ పరిశ్రమ చుట్టూ మిగిలిన భూములన్నీ కంపెనీ కొనాలని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పరిసర గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వటాల గ్రామ పరిధిలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమ రూ.1210 కోట్లు వెచ్చించి చేపడుతున్న ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రతిపాదనపై కాలుష్య నియంత్రణ మండలి అధికారి మునిప్రసాద్, పర్యావరణ అఽధికారి కిశోర్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన, నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌కో సిమెంట్ పరిశ్రమ క్లింకర్ సామర్థ్యం 3.15ఎంటీపీఏ నుండి 6.3ఎంటీపీఏకు పెంచడం, సిమెంట్ ఉత్పత్తి 2.0ఎంటీపీఏ నుండి 5.0ఎంటీపీఏకు పెంచడం, వేస్ట్ హీట్ రికవరీ ప్లవర్ ప్లాంట్ 12.15 ఎండబ్ల్యూ నుండి 27.15 ఎండబ్ల్యూకు పెంచడం కోసం కాలుష్య నియంత్రణ వారు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై రామ్‌కో యూనిట్ హెడ్ రెడ్డి నాగరాజు మాట్లాడుతూ ఆధునాతన టెక్నాలజీతో కాలుష్య రహితంగా సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఇప్పటికే పరిశ్రమ ద్వారా 900మందికి ఉద్యోగాలు లభించాయని, ప్రస్తుత అదనపు ఉత్పత్తి ద్వారా మరో 300మందికి ప్రత్యక్షంగా, 200మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. రూ.17కోట్లు సీఎస్‌ఆర్ నిధులతో ఇప్పటికే రామ్‌కో పరిధిలోని గ్రామాల్లో పలు ప్రజామోద అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులో మరింత అభివృద్ది సంక్షేమం అందిస్తామని రెడ్డి నాగరాజు అన్నారు. మరోవైపు పలు గ్రామాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ రామ్‌కో సీఎస్‌ఆర్ ద్వారా మంచి పనులు చేస్తోందని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. రామ్‌కో పరిశ్రమకు ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయాలని వారు పేర్కొన్నారు. కల్వటాల, కొలిమిగుండ్ల గ్రామాలకు చెందిన రైతులు మాత్రం తమకు రామ్‌కో పరిశ్రమ కాలుష్యం వల్ల నష్టం జరుగుతోందని వాపోయారు. పరిశ్రమ నుండి వచ్చే దుమ్ముతో పంటలు పండటంలేదు కాబట్టి రామ్‌కోకు దగ్గరగా ఉన్న భూములను కొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, సమన్వయకర్త వీఆర్ లక్ష్మీరెడ్డి, పులి ప్రకాశ్‌రెడ్డి, కల్వటాల సర్పంచ్ కామిని సుమలత, కామిని క్రిష్ణరంగారెడ్డి, అంబటి జయలక్ష్మీరెడ్డి, పేరం సత్యనారాయణరెడ్డి, బయ్యపురెడ్డి పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోవస్తు నిర్వహించారు.
ఫిర్యాదులన్నీ నమోదు చేశాం - జేసీ విష్ణుచరణ్: వివిధ వర్గాలు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రస్తావించిన సమస్యలన్నీ నమోదు చేశామని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి పంపనున్నట్లు తెలిపారు. పరిశ్రమ దృష్టికి సమస్యలను తీసుకవెళ్లి పరిష్కారానికి చొరవ చూపేలా ఆదేశిస్తామని జేసీ అన్నారు.
విద్య, వైద్యంపై రామ్‌కో కేంద్రీకరించాలి
రామ్‌కో పరిశ్రమ మా గ్రామ పరిధిలో ఉండటం మాకు గర్వకారణం. గ్రామాల్లో విద్య, వైద్యంపై కంపెనీ దృష్టి సారించాలి. సీబీఎస్ పాఠశాలను ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు విద్యనందించండి.
-కామిని సుమలత (కల్వాటాల - సర్పంచ్)
కాలుష్యాన్ని నియంత్రించాలి
పరిశ్రమ నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలి. పరిశ్రమకు అనుకొని ఉన్న భూములు కొనుగోలు చేయాలి. పంటలకు నష్టపరిహారం అందించేలా చూడాలి.
-గూడూరు నాగేశ్వరరెడ్డి (రైతు- కొలిమిగుండ్ల)