Share News

475 కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:30 AM

రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అన్నారు.

475 కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కార్యక్రమాన్ని విజయానంద్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్లను, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.86 కోట్లను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందని అన్నారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కళాశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా మేధాశక్తి, శారీరక బలంతోపాటు మానసిక వికాసం కలిగే అవకాశం ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని 23 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న 8,679 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో ఒకే రకమైన మెనూ కాకుండా రోజుకోవిధంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. దేశం, రాష్ట్రం గర్వించేలా మంచి పౌరులుగా, మేధావులుగా అన్ని రంగాల్లో విశేష ప్రతిభ చూపించి కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని విజయానంద్‌ విద్యార్థులను ఆశీర్వదించారు. కలెక్టర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలోని కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మరింత పురోగతి సాధిస్తారని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్‌ పాల్‌, డీఎస్పీ మహబూబ్‌ బాషా, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, కల్లూరుల తహసీల్దార్‌ ఆంజనేయులు, కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, డీవీఈవో పరమేశ్వరరెడ్డి, ప్రిన్సిపాల్స్‌ సరళాదేవి, నాగస్వామి నాయక్‌, డీఈవో ఏడీ-1 ఏ.శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:30 AM