Share News

ఓర్వకల్లు సిగలో మరో పరిశ్రమ

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:05 AM

ఓర్వకల్లు ఇండస్ట్రీయల్‌ స్మార్ట్‌ సిటీలో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ చేరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ కష్టం ఫలించింది.

ఓర్వకల్లు సిగలో మరో పరిశ్రమ
మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌ సమక్షంలో ఎంఓయూ పత్రాలు మార్చుకుంటున్న ప్రతినిధులు

రూ.14 వేల కోట్లతో ఇండిచిప్‌ సెమికండక్టర్‌ పరిశ్రమ

చిప్‌ తయారీ దేశంలోనే తొలి పరిశ్రమ ఇది

రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌ సమక్షంలో ఎంఓయూ

కర్నూలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు ఇండస్ట్రీయల్‌ స్మార్ట్‌ సిటీలో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ చేరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ కష్టం ఫలించింది. భారతదేశంలోనే ప్రప్ర థమ చిప్‌ తయారి సెమీకండక్లర్‌ పరిశ్రమ ఏర్పాటుకు కీలకమైన అడుగులు శనివారం పడ్డాయి. చిప్‌ తయారీ రంగంలో దేశాన్ని గ్లోబల్‌ లీడరుగా మార్చే పరిశ్రమను ఇండిచిప్‌ సెమీకండక్టర్స్‌ లిమిటెడ్‌ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్‌కు చెందిన ఎంఎస్‌యితో మైక్రో టెక్నాలజీ కంపెనీ (వైఎంటీఎల్‌)తో కలసి ఏపీలో స్థాపించనున్నారు. ఓర్వకల్లు కేంద్రంగా రూ.14 వేల కోట్టకు పైగా పెట్టుబడితో ప్రైవేట్‌ రంగంలో సెమికండక్టర్‌ పరిశ్రమ స్థాపిం చేందుకు రాష్ట్ర మానవవనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ సమక్షంలో ఇండిచిప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీయూష్‌ బిచ్ఛోరియా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈడీబీ సీఈవో సాయికాంత్‌ వర్మలు అవగాహన ఒప్పంద (ఎంఓయూ) కుదుర్చుకున్నారు. ఈ మేరకు అమరావతిలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి.. ఆ పత్రాలను ఒకరిఒకరు మార్చుకున్నారు. ఇప్పటికే ఓర్వకల్లు పారిశ్రా మికవాడలో సెమికండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు భాగస్వామ్య సంస్థలు పరిశీలించాయి. పరిశ్రమకు ఏర్పాటు అవసరమైన దాదాపు 250 ఎకరాలకు పైగా భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఆమోదించింది.

గత డిసెంబరులో ఓర్వకల్లుకు సెమికండక్టర్‌ పరిశ్రమ రాబోతుందని, రూ.14 వేల కోట్లకుపైగా పెట్టుబడితో ఈ పరిశ్రమ రాబోతుందని, దేశంలోనే మొట్టమొదటి పరిశ్రమను ఏపీకి తీసుకురావడం, అందులోనూ ఓర్వకల్లులో ఏర్పాటు చేసేలా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ఎంతో చోరవ తీసుకున్నారని మంత్రి టీజీ భరత్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. జనవరి తొలివారంలో కంపెనీ, ప్రభుత్వ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకొని సంబంధిత పత్రాలపై సంకాలు చేస్తారని కూడా వెల్లడించారు. 2024 నవంబరులో ప్రకటించిన సెమీకండక్టర్‌ పాలసీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్టానిక్స్‌, సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా మారుస్తుందని టీజీ భరత్‌ వివరించారు. సరికొత్త ఎస్‌ఐసీ ఫ్యాబ్‌ సైకర్యం ప్రారంభంలో నెలకు 10,000 వాఫర్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం అవుతుంది. రెండుమూడేళ్లలో 50,000 వాఫర్స్‌ ఉత్పత్తి చేరుకుంటుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ దృష్టితో అనుసంధానమై, విద్యుత్‌ వాహనాలు, నూతన ఇంధన పరికరాలు, పునరుత్పత్తి శక్తి ద్వారా పెరుగుతున్న గ్లోబల్‌ డిమాండ్‌ తీర్చేందుకు దోహదం పడుతుందని అంటున్నారు.

యువతకు ఉద్యోగాలే లక్ష్యం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఆ కష్టంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. సెమీకండక్టర్‌ పరిశ్రమ ఓర్వకల్లు హబ్‌కు రావడంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చు. దేశంలో వేరే రాష్ట్రానికి వెళ్లే ఈ పరిశ్రమను ఐటీ మంత్రి నారా లోకేశ్‌ మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. లోకేశ్‌ను ఒప్పించి ఆ పరిశ్రమను మన జిల్లాకు తీసుకొచ్చాను. భారతదేశాన్నే చిప్‌ తయారీలో గ్లోబల్‌ లీడర్‌గా మార్చే ఈ పరిశ్రమ జిల్లాకు తీసుకురావడంతో జన్మభూమి రుణం కొంతైనా తీర్చుకున్నాను అనే ఆనందం కలిగింది. - టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

Updated Date - Jan 12 , 2025 | 12:05 AM