ఉల్లి, కంది మరింత కుదేలు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:20 AM
ఈ సంవత్సరం పంటల దిగుబడి బాగానే ఉన్నా ధరలు మాత్రం రోజురోజుకూ పతనం అవుతున్నాయి.
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఈ సంవత్సరం పంటల దిగుబడి బాగానే ఉన్నా ధరలు మాత్రం రోజురోజుకూ పతనం అవుతున్నాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు దిగాలుపడుతున్నారు. ముఖ్యంగా ఉల్లి, కంది ధరలు బాగా పడిపోయాయి. గత వారం ఉల్లిగడ్డలు క్వింటం గరిష్ఠ ధర రూ.4వేలకు పైగానే పలికింది. గురువారం కర్నూలు మార్కెట్ యార్డులో ఆ ధర రూ.2,779కు పడిపోయింది. మధ్యస్థ ధర రూ.2,285, కనిష్ఠ ధర రూ.1,635కు తగ్గింది. కందులకు గరిష్ఠ ధర రూ.8,018, మధ్యస్థ ధర రూ.7,196, కనిష్ఠ ధర కేవలం రూ.3,966 మాత్రమే దక్కింది. ఎండుమిరప కాయల ధర గరిష్ఠంగా క్వింటానికి రూ.16,100 మధ్యస్థ ధర రూ.11,769, కనిష్ఠ ధర రూ.2,222 రైతుల చేతికి అందింది. వేరుశనగ కాయలు గరిష్ఠ ధర రూ.6,400, మధ్యస్థ ధర రూ.5,212, కనిష్ఠ ధర రూ.4,512 దక్కింది. మొక్కజొన్నలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర దక్కలేదు. క్వింటం మొక్కజొన్నలకు కేంద్రం రూ.2,550లు మద్దతు ధర ప్రకటిస్తే.. కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటానికి గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధరలు రూ.2,109 రైతులకు అందింది. మినుములు గరిష్ఠ ధర రూ.7,911, మధ్యస్థ ధర రూ.7,911, కనిష్ఠ ధర రూ.7,011 మాత్రమే దక్కింది. సజ్జలకు గరిష్ఠ ధర రూ.2,711, మధ్యస్థ ధర రూ.2,339, కనిష్ఠ ధర రూ.2,241 దక్కింది. ఆముదాలకు గరిష్ఠంగా రూ.5,600, మధ్యస్థం రూ.5,459, కనిష్ఠంగా రూ.4,090 పలికింది.