Pidakala Samaram: మొదలైన పిడకల సమరం.. ఎక్కడంటే..
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:50 PM
Pidakala Samaram: పిడకల సమరం ప్రారంభమైంది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అస్పిరి మండలం కైరుప్పలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. అనంతరం ఒక వర్గంపై మరో వర్గం పిడకలు విసురుకున్నారు.

కర్నూలు,మార్చి 31: కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కైరుప్పలలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రెండు వర్గాలుగా వీరభద్రస్వామి, కాళీకామాత భక్తులు విడిపోయారు. వీరి మధ్య హోరా హోరీగా పిడకల సమరం మొదలైంది. ఈ పిడకల సమరం చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు.
శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయవంతమైంది. అందుకు పిడకల సమరం దోహదపడటంతో ప్రతి ఏటా కైరుప్పల గ్రామంలో దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకను నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత శ్రీవీరభద్రస్వామి, కాళీకాదేవికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి.. పిడకల సమరంలో పాల్గొన్నారు. ఈ పిడకల సమరం చూసేందుకు కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం భారీగా కైరుప్పలకు చేరుకున్నారు. ఈ పిడకల సమరానికి చారిత్రక నేపథ్యంలో ఉందని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
చారిత్రక నేపథ్యం..
విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామిని చూసి కాళీకాదేవి ప్రేమలో పడింది. వివాహం చేసుకొంటానని ఆమెను వీరభద్రుడు మాట ఇస్తాడు. అయితే ఆ తర్వాత వీరభద్రస్వామి ఇచ్చిన మాట తప్పడంతో.. కాళీకా దేవి వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దీంతో వీరభద్రుడి వర్గీయులపై పిడకలతో వారు దాడికి దిగారు. దీంతో వారు సైతం ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఈ పిడకల సమరాన్ని ఆపించి.. పెద్దలు పంచాయితీ చేసి.. వీరభద్రస్వామికి కాళీకాదేవికి వివాహం చేశారని గ్రామస్తులు ఈ సందర్భంగా వివరించారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమ వ్యవహారం కారణంగా భక్తులు పిడకల సమరం చేసుకోవడం శతాబ్దాలుగా ఆచారంగా వస్తోందని తెలిపారు.
ఇలా సాగుతోంది సమరం..
పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల ముందు నుంచి పశువుల పేడతో ఈ పిడకలు తయారు చేస్తారని వివరించారు. ఉగాది వెళ్లిన మరుసటి రోజు ఆ పిడకలను దేవుడి సన్నిధిలో ఉంచుతారని.. ఆ క్రమంలో పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోతారని చెప్పారు.
అనంతరం వారు పిడకలతో కొట్టుకుంటారని.. అయితే ఈ సమరంలో దెబ్బలు తగలకుండా తుండు గుడ్డలను గ్రామస్తులు తమ ముఖాలకు ముసుగు తొడుక్కుంటారని పేర్కోన్నారు. దాదాపు అరగంట పాటు ఈ పిడకల సమరం జరుగుతోందని తెలిపారు. ఈ సమరంలో పలువురు భక్తులు గాయపడుతారని.. దీంతో వారంతా స్వామి వారి కుంకుమను ఆ గాయాలపై రాసుకుంటారని పేర్కొన్నారు.
ఆచారం..
కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్థుల్లో ఒకరు పిడకల సమరం రోజు శిరస్సున కిరీటం ధరిస్తారు. అలాగే ఖడ్గం చేత పట్టుకుని అశ్వంపై కైరుప్పల గ్రామానికి తన అనుచరులతో వారు కలిసి వస్తారు. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కారుమంచి వైపు వెళ్తారు. ఆ తర్వాత పిడకల సమరం ప్రారంభమవుతోంది. అయితే కైరుప్పలలోని ఆలయం అభివృద్ధిలో పెద్దరెడ్డి వంశస్థులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తారని గ్రామస్తులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Maoists: వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్
Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..