Share News

చెరువులో పట్టాలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:19 AM

పూర్వకాలంలో చెరువులకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఊరి శివారులో చెరువు తవ్వుకుంటే వర్షం నీరు నిలిచి పంట పొలాలకు ఉపయోగపడతాయి.

చెరువులో పట్టాలు
గొంది వెంకన్న చెరువు

ఎలా ఇస్తారంటున్న ఆయకట్టు రైతులు

కబ్జా అయిన సగం చెరువు

మద్దికెర, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పూర్వకాలంలో చెరువులకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఊరి శివారులో చెరువు తవ్వుకుంటే వర్షం నీరు నిలిచి పంట పొలాలకు ఉపయోగపడతాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. పశు పక్ష్యాదులకు దాహం తీర్చుతాయి. అనేక రకాలుగా మేలు చేసే చెరువులు ఇప్పుడు అన్యాక్రాంతమవుతున్నాయి. మండలంలోని ఎడవలి గ్రామం గొంది వెంకన్న చెరువును దాదాపు 50 ఎకరాల్లో తవ్వారు. సర్వే నెంబర్లు 288, 318, 321, 317/1బి, 319, 321, 325/1, 327, 325లో 33 ఎకరాలు ఉండగా.. 322/1బీలో 14 ఎకరాల 16 సెంట్ల భూమిని గ్రామానికి చెందిన 11 మంది రైతులు పట్టాలు పొందారు. గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు ఆ గొంది చెరువు నమ్ముకుని 150 ఎకరాల వరకు పంటలను సాగు చేస్తున్నారు. అయితే 1997లోనే తమకు ఆ చెరువులో 14 ఎకరాలు పట్టాలు ఇచ్చారని గ్రామానికి చెందిన రాధాముని రెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీదేవితో పాటు మరో ఆరుగురు తెలిపారు. కానీ చెరువులో పట్టాలు ఎలా ఇస్తారంటూ గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. గొంది వెంకన్న చెరువుకు రైతులు తూము కూడా ఏర్పాటు చేసుకున్నారు. చెరువుకు హంద్రీ నీవా నీరు నింపడం వల్ల నీరు పుష్కలంగా ఉండటంతో పంచాయతీవారు చేపలు కూడా వదిలారు. పట్టాలు పొందిన రైతులు మాకు చెరువుల్లో పొలం ఉంది కాబట్టి చేపలు వచ్చిన డబ్బులో సగభాగం ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ కూడా విచారణ చేపట్టారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకుని పట్టాలు ఇచ్చారని గ్రామస్థులు తెలుపుతున్నారు.

చెరువులో పట్టాలు ఎలా ఇస్తారు

గొంది వెంకన్న చెరువులో రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా ఇస్తారు? చెరువులో నీరు ఉన్నందు వల్ల పొలంలోని వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయు. రెవెన్యూ అధికారులు ఆ పట్టాలు రద్దు చేసి ఆయకట్టుకు చెరువు నీరు అందేలా చూడాలి.

- నంది జయరాముడు, ఎడవలి

మాకు పట్టాలు ఇచ్చారు

గొంది వెంకన్న చెరువులో రెవెన్యూ అధికారులు కొన్నేళ్ల కిందటే మాకు పట్టాలు ఇచ్చారు. ఆన్‌లైన్‌ కూడా అయింది. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ చెరువులో మాకు భాగం ఉంది. కాదంటే రెవెన్యూ అధికారులు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం భూమి విలువ కట్టించి ఇస్తే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

- మునీశ్వరరెడ్డి, ఎడవలి

జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం

గొంది వెంకన్న చెరువు సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. గతంలో కొంత మంది రైతులు పట్టాలు పొందారు. రికార్డులో కూడా అదే ఉంది. జిల్లా అధికారులకు ఈ విషయం చెప్పాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం.

- తహసీల్దార్‌, హుశేన్‌ సాహేబ్‌

Updated Date - Jan 03 , 2025 | 12:19 AM