అవనిపై హరివిల్లు
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:36 AM
అవని.. అందాల ముత్యాల ముగ్గులతో మురిసింది.
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
నంద్యాల టెక్కె మార్కెట్ ముగ్గుల మయం
రాయలసీమ సంస్కృతి భిన్నమైనవి
బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి
అవని.. అందాల ముత్యాల ముగ్గులతో మురిసింది. రంగురంగుల ముగ్గులు వేసేందుకు మహిళలు వయసు తారతమ్యాలను మరచి పోటీపడగా.. చూపరుల మది పులకించింది. తెలుగు లోగిళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే అచ్చతెలుగు పండుగ సంక్రాంతి. ఈ పండుగను పురస్కరించి ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ముత్యాల ముగ్గుల పోటీల సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు చిట్టి చేతులతో రంగవల్లులు వేస్తుంటే... మహిళలు కొంగు బిగించి అందాల హరివిల్లులను తీర్చిదిద్దారు. నానాటికీ కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలను ప్రస్తుత తరానికి తెలిపే విధంగా తీర్చిదిద్దిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగు రంగుల ముగ్గులు వేసేందుకు మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి ముందే వచ్చిందా అనేలా సందడి నెలకొంది. మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులతో రంగుల హరివిల్లు రూపుదిద్దుకొంది. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో జరిగిన పోటీలకు మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. మహిళలు వేసిన రంగుల ముగ్గులు కనువిందు చేశాయి.
నంద్యాల కల్చరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో శనివారం నంద్యాలలోని టెక్కె మార్కెట్ యార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభిచింది. 92 మంది మహిళలు వేసిన ముత్యాల ముగ్గులు మురిపించాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పోటీలు 12.00 గంటల వరకు జరిగాయి. రెండు గంటల వ్యవధిలో మహిళలు రంగువల్లులను అందంగా, చుక్కలతో తీర్చిదిద్దారు. చుక్కలతో, సహజ సిద్ధంగా, సంస్కృతికి అద్దం పడుతూ ముగ్గులను తీర్చిదిద్దారు. ఉదయం నిర్ధేశించిన సమయానికి గంట ముందుగానే వచ్చి తమ తమకు కేటాయించిన స్థలాల్లో పేడతో అలికి సిద్ధం చేసుకున్నారు. ఇళ్ల దగ్గరి నుంచే రంగులను ముగ్గులకు సిద్ధం చేసుకొని వచ్చారు. మరి కొందరు మహిళలు గొబ్బెమ్మలు, రకరకాల రంగుల్లో ఉన్న పూలను, చెరకు గడలను, నవధాన్యాలను వెంట తెచ్చుకొని తాము వేసిన ముగ్గులను మరింత అందంగా తీర్చిదిద్దారు. ముత్యాల ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్, శివలావణ్య, మణిమంజరి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథి బీసీ రాజారెడ్డి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా రూ.6వేలు, రెండో బహుమతిగా రూ.4 వేలు, మూడో బహుమతిగా రూ.3వేలు అందజేశారు. అదేవిధంగా నాలుగు, ఐదు బహుమతులుగా రూ.2,500 చొప్పున అందజేశారు. వీటితో పాటు పదిమందికి కన్సోలేషన్, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్, ఎడిషన్ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్ నాయుడు, బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, స్టాఫ్ రిపోర్టర్ సి.గోపాలకృష్ణ, యాడ్స్ అసిస్టెంట్ మేనేజర్ గోపాల్, ఏబీఎన్ ప్రతినిధి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయాలను కాపాడుకుందాం
బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళ లు కీలక భూమిక పోషించాలని బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. రాయలసీమలో పండుగలకు ప్రత్యేక ప్రాధా న్యత ఉంటుందని, సీమ ప్రజలు ఉన్నంతలో పండుగలను గొప్పగా చేసుకుంటారన్నారు. కుటుంబంతో పాటు సమాజా న్ని చక్కదిద్దగలిగే శక్తి ఒక్క మహిళకే ఉందన్నారు. కన్న పిల్లలను మార్కులు తెచ్చే యంత్రాలుగా కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలు మారాం చేస్తే సెల్‌ఫోన్లు ఇచ్చి బుజ్జగించే విష సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. మన బిడ్డలకు మానవీయ విలువలతో పెంచితేనే వృద్ధాప్యంలో అనాథ ఆశ్రమాల్లో వదిలేయకుండా బాగా చూసుకుంటారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం దేశం గొప్పతనమన్నారు. ముగ్గుల పోటీలకు స్పాన్సర్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు బీసీ రాజారెడ్డి తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో బహుమతి సాధించాలని ఉంది
నంద్యాల జిల్లాస్థాయి ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి సాధించినందుకు సంతోషంగా ఉంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముగ్గుల పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైతే అక్కడ రాణించి మొదటి బహుమతి సాధించాలని ఉంది. గతంలో రాష్ట్రస్థాయికి ఎంపికై విజయవాడలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్నాను. ఈ ఏడాది ముగ్గుల పోటీలు ఉత్సాహంగా, ఉత్కంఠ భరింతగా జరిగాయి.
-శ్రీలక్ష్మి, నంద్యాల, ప్రథమ బహుమతి విజేత
ఆంధ్రజ్యోతికి ప్రత్యేక కృతజ్ఞతలు
మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మహిళలు పోటాపోటీగా తీర్చిదిద్దిన రంగవళ్లుల్లో ప్రత్యేక స్థానం సాధించి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది.
- రామేశ్వరమ్మ, బేతంచర్ల, ద్వితీయ బహుమతి విజేత
ఏటా పాల్గొంటున్నాను
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఏటా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీల్లో ప్రతిసారి పాల్గొంటున్నాను. మహిళల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ముగ్గులు వేయడం ఎంతో ఇష్టం.
- ప్రశాంతి, పాణ్యం, తృతీయ బహుమతి విజేత